గతంలో అధికారం లేదు అవకాశం లేదు అది ఓకే .. కానీ ఇప్పుడు అధికారం ఉంది అవకాశం అన్నది తమ దరిదాపుల్లోకి కూడా రావటం లేదు..
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణుల ఆవేదన ఇలాగే ఉంది. జనసేన పార్టీ ఆవిర్భవించి దశాబ్ద కాలం దాటిపోయింది. సంస్థాగతంగా బలపడేందుకు అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని జనసైనికులు అందరూ వాపోతున్న పరిస్థితి. జిల్లా స్థాయిలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు అంటూ ఎవరూ లేకపోవడంతో తమ పార్టీ చుక్కాని లేని నావల మారింది అంటూ జనసైనికులు ... పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో ఎదుర్కొన్న పరాభవాల నుంచి ఉపశమనం లభించి, తగిన గుర్తింపు గౌరవంతో పాటు పదవులు లభిస్తాయి అని ఆశపడిన వారందరికీ తీవ్ర నిరాశ తప్పడం లేదు. పార్టీ పరంగా ఆయా స్థాయిలో ఉన్నామని ఎవరికి వారు ఊహల్లో విహరించడమే తప్ప వాళ్ళ మాట కూటమి ప్రభుత్వంలో అస్సలు చెల్లుబాటు కావడం లేదు.
కొన్ని నియోజకవర్గాలలో జనసేన ఎమ్మెల్యేలు, జనసేన ఎంపీలు ఉన్న వారు తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావలసిన పరిస్థితి వచ్చేసింది. పోనీ ప్రభుత్వపరంగా ఏమైనా కార్యక్రమాల్లో వేదికను పంచుకునే అవకాశం లభిస్తుందా ? అంటే ప్రోటోకాల్ అందుకు ఒప్పుకోవటం లేదు. చాలా చోట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన నాయకులకు సరైన గుర్తింపు గౌరవం కూడా ఇవ్వటం లేదని వాపోతున్నారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి జిల్లా .. మండల .. గ్రామస్థాయిలో కార్యవర్గం కమిటీలు ఉంటే ఆ పార్టీ బలపడుతుంది. అయితే పార్టీ అధినాయకత్వం ఆ దిశగా కమిటీలు ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు చాలా చేతి చమురు వదిలించుకున్నామని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా డబ్బులు ఖర్చుపెట్టిన ఉపయోగం లేదని వారందరూ వాపోతున్న పరిస్థితి. ఏది ఏమైనా జనసేనాని.. ఈ విషయంలో కేడర్లో మార్పు తీసుకురాకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కేడర్ చాలా మంది పనిచేసే పరిస్థితి లేదన్నది క్లియర్ గా అర్థమవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు