
డాక్టర్ల ప్రకారం.. ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న వైరల్ జ్వరాలు సాధారణంగా 102°F, 103°F లేదా 104°F వరకు శరీర ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో గాబరా పడకుండా, వెంటనే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితిని నియంత్రించవచ్చు అని చెప్తున్నారు. బాడీ టెంపరేచర్ లెవల్స్ పెరిగినప్పుడు అంటే జ్వరం ఎక్కువ అయినప్పుడు తడి బట్టతో శరీరాన్ని తుడవడం తప్పనిసరి అని చెప్తున్నారు. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు మొదటగా ఇంట్లోనే తడి బట్టతో శరీరాన్ని మెల్లగా తుడవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. హై ఫీవర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. 102°F పైగా జ్వరం ఉంటే, ఇంటి వద్ద చిన్నపాటి చర్యలతో పాటు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం అత్యవసరం అని గుర్తు పెట్టుకోండి.
వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లడం ఇంకా మంచిది. పిల్లల్లో లేదా వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రత 101°F దాటితే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం ఉత్తమం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, అలసట వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి సాధారణ జ్వరాల కంటే తీవ్రమైన సంకేతాలు కావచ్చు. అందువల్ల స్వయంగా మందులు వాడకుండా డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. అనేక కుటుంబాలు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రులు పూర్తిగా రద్దీగా ఉన్నందున, సమయానికి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.
నివారణ కోసం ముఖ్యమైన సూచనలు:
*పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బయట తిరగకుండా చూసుకోవాలి.
*ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచి, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
*నీళ్లు బాగా తాగి, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
*శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.
* తల్లిదండ్రులు పిల్లల్లో చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం వైద్య నిపుణుల సలహాలను ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. మీకు లేదా మీ కుటుంబసభ్యులకు ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. స్వయంగా మందులు వాడటం కంటే డాక్టర్ సూచనలు తీసుకోవడం మరింత సురక్షితం అని గుర్తు పెట్టుకోండి.