
నువ్వెవరు.. ఇదేం పిచ్చి ప్రశ్న అనిపించొచ్చు కానీ మనసును శోధించే క్రమంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఇదే కీలకమైన ప్రశ్న. నీ పుట్టుకో, నీ వృత్తో, నీ స్థానమో నువ్వు కాదు. మరి నువ్వెవరు.. ఈ అన్వేషణ అమూల్యమైంది. ఈ ప్రశ్నకు సమాధానం వెదకడంలోనే నీకు అసలైన సమాధానం దొరుకుతుంది.
‘నీలోనికి నువ్వు ప్రవహించు. నిర్విరామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు. ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు. అన్నింటికీ ఆద్యమైన మనోబలాన్ని విశ్వసించు. హృదయాన్ని శాంతిధామంగా నిర్మించు. ఆ అనంత మౌనంలో విశ్రమించు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించు.. ఇవీ భగవాన్ రమణ మహర్షి ఆత్మ సాక్షాత్కరం కోసం చెప్పిన మాటలు.
ఈ మాటల అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాసేపు పక్కకు రావాలి. మిమల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక చింతనకు ఇదే మొదటి మెట్టు. ఎందుకంటే.. అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు. అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఈ నేను అనే అహంకారాన్ని వదలాలి. శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అంశాలతో మనసు అనుసంధానం కావాలి. అప్పుడు జ్యోతిర్మయంగా మనో మందిరం వెలుగుతుంది.