తప్పును అంగీకరించడం చాలా గొప్ప లక్షణం.. దురదృష్టవశాత్తూ అది మనలో చాలా మందికి ఈ గొప్ప లక్షణం ఉండదు. అసలు మనం తప్పు చేశామని మన మనస్సు ఒక పట్టాన ఒప్పుకోనే ఒప్పుకోదు.. ఒక వేళ మన మనస్సు అంగీకరించినా.. ఆ విషయాన్ని పది మంది ముందు ఒప్పుకునే ధైర్యం ఉండదు.

 

 

అందుకు మన ఇగో అడ్డం వస్తుంది. ఇదే మన విజయానికి ప్రతిబంధకం అవుతుంటుంది. ఎందుకంటే.. మనం మన జీవితంలో ఏది సాధించాలన్నా.. ముందు సాకులు వెదికేస్తాం.. అబ్బో మనకు అంత సమయం లేదని చెప్పి తప్పించుకుంటాం. చాలామంది చెప్పే సాకు.. ఇదే.. నాకు టైమ్ లేదండీ.. అబ్బే అంత తీరిక మనకు ఎక్కడండీ.. అబ్బో నేను చాలా బిజీ అండీ.. ఈ సమాధానం మనందరికీ చాలా రొటీన్.

 

 

అయితే.. ఈ విషయంలో మనం ఆత్మపరిశీలన చేసుకుంటే గానీ అసలు వాస్తవం బోధపడదు. అసలు మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవాలంటే.. సింపుల్ చిట్కా ఉంది. మనం మన రోజులో 24 గంటల సమయాన్ని ఒక వారం రోజులపాటు ఎలా వినియోగించుకుంటున్నామో గంటల వారీగా రాసి పెట్టుకుంటే సరి.

 

 

అప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది.. మనం ఎంత సమయం వృథా చేస్తున్నామో.. కబుర్లకూ.. కాలక్షేపానికి, మొబైల్ కీ, టీవీకి ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నామో.. అప్పుడు మనకు ఎక్కడ సమయం ఆదా చేసుకోవచ్చో ఇట్టే అర్థమవుతుంది. అలా వృథా అయ్యే సమయాన్ని మనం సరిగ్గా వాడుకుంటే ఎన్నో విజయాలు సాధించగలం. కావాలంటే ఓవారం రోజులు ప్రయత్నించి చూడండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: