బాలీవుడ్ హీరో సుశాంత్ ‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత జరిగిన అనేక పరిణామాలు ఆయన కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలో నెట్టేశాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనక కుట్రకోణం ఉందని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సహా వారి తండ్రి కూడా ఆరోపించారు. చివరకు ఆ ఆరోపణలన్నీ అసత్యాలని తేలిపోయినా చెట్టంత కొడుకుని కోల్పోయిన ఆ కుటుంబం తీవ్రంగా కుంగుబాటుకి లోనైంది. ఇటీవల కాలంలో సుశాంత్ సింగ్ కుటుంబం పెద్దగా వార్తల్లోకి రావడంలేదు. కొన్నాళ్లు ఒంటరిగానే ఉండటానికి ఆ కుటుంబం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు నెపోటిజం కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌ల‌తో మొద‌లై చివ‌రికి మాదక ద్రవ్యాలవైపు మలుపు తిరిగింది. ఈ నేప‌థ్యంలో సుశాంత్ సోద‌రి శ్వేతాసింగ్ కీర్తి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సోదరుడి మృతిపై విచార‌ణ‌కు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత సోద‌రుడి గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఆమె షేర్ చేస్తూ వ‌చ్చారు. సుశాంత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత కేసు డ్రగ్స్ వ్యవహారంలోకి మలుపు తిరగడంతో.. ఆమె కూడా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

తాజాగా శ్వేతాసింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సోష‌ల్ మీడియా నుంచి పూర్తిగా ఆమె తప్పుకున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ నుంచి తప్పించుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య జరిగి అక్టోబర్14కు నాలుగు నెలలైన సందర్భంగా  "నిజమైన ప్రేరణ" అంటూ ఒక  వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.  ఇదే స‌మ‌యంలో  ఆమె స‌డెన్‌గా తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి సుశాంత్ సోదరి తన ఫేస్ బుక్  అకౌంట్ మాత్రం కొన‌సాగిస్తున్నారు. మరికొన్నాళ్ల తర్వాత అయినా ఆమె పూర్తిస్థాయిలో సోషల్ మీడియాలోకి వస్తారా లేక కేవలం ఫేస్ బుక్ కే పరిమితమవుతారా అనే విషయం తేలాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: