హీరో విశాల్ తో పెళ్లి ఖ‌రారు అయ్యాక ప్ర‌ముఖ త‌మిళ న‌టి సాయి ధ‌న్షిక పేరు వార్త‌ల్లో మారుమోగిపోతుంది. ఆమెకు సంబంధించి ఏ చిన్న విష‌య‌మైనా ఇట్టే వైర‌ల్ అవుతోంది. తాజాగా ఓ తెలుగు ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన ధ‌న్షిక‌.. ప్రొఫెష‌న‌ల్ లైఫ్ తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు కూడా పంచుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కు జ‌రిగిన ఓ అవ‌మానం గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.


 2017లో తమిళ చిత్రం `విజితిరు` ప్రచార కార్యక్రమంలో ద‌ర్శ‌క‌న‌టుడు, స్టార్ యాక్ట‌ర్ శింబు తండ్రి టి. రాజేందర్ సాయి ధ‌న్షిక‌ను అందరి ముందు ఘోరంగా అవ‌మానించారు. స్టేజ్‌పై హీరోయిన్ ధ‌న్షిక విజితిరు మూవీ టీమ్‌ను ధ‌న్య‌వాదాలు చెబుతూ టి. రాజేంద‌ర్ పేరును మ‌ర‌చిపోయింది. ఇది రాజేందర్‌ను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో అదే స్టేజ్‌పై ధ‌న్షిక‌ను ఆయన దారుణంగా విమ‌ర్శించారు.

 

`కబాలి` వంటి పెద్ద చిత్రాల్లో నటించాక తనలాంటి వారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అంటూ ధన్షిక‌పై రాజేంద‌ర్ విరుచుప‌డ్డారు. వెంట‌నే ధ‌న్షిక మైక్ తీసుకుని పొరపాటైందంటూ క్షమాపణలు చెప్పినా.. ఆయ‌న ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. దాంతో స్టేజ్‌పేనే ధ‌న్షిక క‌న్నీళ్లు పెట్టుకుంది. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న కోలీవుడ్‌లో అనేక చ‌ర్చ‌ల‌కు దారితీసింది. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో నాటి రోజుల‌ను ధ‌న్షిక గుర్తు చేసింది.



`నేను న‌టించిన విజితిరు చిత్రం ఆలస్యంగా విడుద‌లైంది. ప్రమోషన్స్ కి రమ్మని డైరెక్ట‌ర్ రిక్వెస్ట్ చేయడంతో హెల్త్ బాగోక‌పోయినా వెళ్లాల్సి వ‌చ్చింది. రెండు మాట‌లు మాట్లాడి వెళ్లిపోతాన‌ని ముందే చెప్పాను. అనుకోకుండా నా వ‌ల్ల చిన్న పొర‌పాటు జ‌రిగింది. అందుకు అక్క‌డే రాజేంద‌ర్ గారికి సారీ చెప్పినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఆ రోజు ఆయ‌న చేసిన అవ‌మానం లైఫ్‌లో మ‌ర్చిపోలేను. దాన్ని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి వారం రోజులు ప‌ట్టింది. ఆ స‌మ‌యంలో ఇండ‌స్ట్రీలోని చాలా మంది నాకు స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డారు` అంటూ ధ‌న్షిక చెప్పుకొచ్చింది. అయితే అప్ప‌ట్లో ధ‌న్షిక‌కు స‌పోర్ట్ చేసిన‌వారిలో విశాల్ ఒక‌రు. ఇక ఈ ఘ‌ట‌న‌తోనే విశాల్, ధ‌న్షిక మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని కూడా అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: