
జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కుబేర కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కుబేర సక్సెస్ మీట్ ను శనివారం నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ధనుష్ ఫ్యాన్స్ కు ఇచ్చి పడేశారు. కుబేర విడుదలకు ముందు ఒకలా విడుదల తర్వాత ఒకలా నాగార్జున మాట్లాడుతున్నారంటూ ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు కుబేర శేఖర్ కమ్ముల చిత్రమన్న నాగార్జున.. విడుదల తర్వాత హిట్ టాక్ రాగానే తనదే ఈ సినిమా అంటూ మాట్లాడటం ధనుష్ అభిమానుల ఆగ్రహానికి గురిచేసింది.
అయితే ఈ విషయంపై తాజాగా నాగార్జున వివరణ ఇచ్చారు. కుబేర మూవీ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని నాగ్ అన్నారు. శేఖర్ కమ్ముల కథ చెబుతున్న టైమ్‌లో దీపక్ పాత్ర చుట్టూ ఇతర పాత్రలు తిరుగుతాయని చెప్పారని, అందుకే ప్రెస్ మీట్‌లో నా (దీపక్) సినిమా అని అన్నానని.. ఆ మాటలను వక్రీకరిస్తూ ట్రోల్స్ చేశారని నాగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది దేవా (ధనుష్) సినిమా, అలాగే దీపక్(నాగార్జున) సినిమా, సమీర (రష్మిక) సినిమా.. అంతేకాకుండా సినిమాలో నటించిన అందరి సినిమా. అన్నింటికీ మించి ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా అని సక్సెస్ మీట్‌లో నాగ్ పేర్కొన్నారు.