ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. లాక్‌డౌన్ వేళ జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో పేద...మధ్య తరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడే షాపులపై దాడులు చేస్తున్నారు. ఎక్కడికక్కడే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. సరుకుల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు జిల్లా అధికారులు.
లాక్‌డౌన్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి...షాపులు సీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ హెచ్చరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాపారులు సేవా దృక్పథంతో ప్రజలకు సహకరించాలని కోరారు. షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ధరల పట్టికలు ఏర్పాటు చేయకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు జిల్లా ఎస్పీ రంగ నాథ్.
అయితే...జిల్లా అధికారులు అధిక ధరలపై వ్యాపారులను ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు మాత్రం రావటం లేదు. కూరగాయలు ఒక్కొక్క దగ్గర ఒక్కో రేటుతో అమ్ముతున్నారు. నాణ్యత పేరుతో వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారు. వ్యాపారులు ధరల పట్టికలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తూనికలు కొలతల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం షాపులకు వెళ్తున్న వారు సామాజిక దూరం పాటించడం లేదు. షాపుల్లో పనిచేసేవారు మాస్కులు ధరించడం లేదు. అధిక ధరలపై వినియోగదారులు అధికారులకు పిర్యాదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నల్గొండను క్లస్టర్ జోన్‌గా ప్రకటించింది.
మరోవైపు...మోసాలకు పాల్పడిన 49 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు అధికారులు. నల్గొండ జిల్లాలో ఏడాది కాలంలో 2 వందల కేసులను నమోదు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 8 లక్షలు రూపాయలు ఫైనాల్టీ వేశామని అధికారులు చెబుతున్నారు. ఇక...లాక్‌డౌన్ వేళ అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయిస్తున్న దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పలు షాపులను సైతం సీజ్ చేశారు. మొత్తానికి...నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి