కృష్ణశాస్త్రి కావొచ్చు, మ‌రొక‌రు కావొచ్చు....ఒక సంద‌ర్భంలో, ఆమె క‌న్నుల‌లో అనంతాంబ‌ర‌పు నీలినీడ‌లు క‌ల‌వు అనీ, మ‌రో సంద‌ర్బంలో - రాత్రి ఎవ్వని స్వప్నసీమ‌ల‌కేగి వ‌చ్చె? అనీ - ఇంకా ఏమిటేమిటో మ‌ధురోహ‌లు పోతారు. అద్భుతమైన వర్ణలు చేస్తారు. ఎంతైనా భావకవులు కదా!

 

వాళ్లదేంబోయిందీ...పిచ్చెక్కించే ఇమేజరీలు వేసి తమకేమీ సంబంధం లేదన్నట్టు ఊరుకుంటారు. కానీ అవి ఊరుకుంటాయా? కవి నుంచి పాఠ‌కుడికి ఎంతో కొంత సౌంద‌ర్యోన్మత్తతను ప్రసారం చేయకుండా ఉంటాయా? ఇక ఎవరి ఇమాజినేషన్‌ వాళ్లది. ఊహ కొద్దీ చిత్రం. భావ‌న కొద్దీ బాధ‌.

 

కానీ కవి కల్పనను నిజంగా చిత్రించాలంటే ? తెలుపునలుపు వ‌ర్ణాల‌తో ఒక రూపునివ్వాలంటే , రంగుల‌తో ర‌క్తమాంసాలివ్వాలంటే , బ్రహ్మను డ‌మ్మీని చేయాలంటే, ఎవ‌రున్నారు.. ఒక్క వ‌డ్డాదిపాప‌య్య త‌ప్ప...?

 

IHG

ఆమె కనులలో అనంతాంబరపు నీలినీడలను అతడు మాత్రమే ఆవిష్కరించగలడు. ఏమి శైలి, ఏమి సౌందర్యం..! కళ్లతో చూడటం, చేతులెత్తి మొక్కటం తప్ప " ప్రాచ్య చిత్రకళా రీతులు - వడ్డాది చిత్రాలు' అని హెడ్డింగ్‌ పెట్టి, ఆయన కళనీ, దాని ఔన్నత్యాన్నీ విశ్లేషించే సీన్‌ లేదు నాకు.

 

IHG

 

 

నో డౌట్‌. నేను ఆయనకు వీర ఫాన్‌ను. కానీ, ఒక్కసారి కూడా చూడలేకపోయానే అని బాధ.. చివరికి వాళ్ల ఊరికి వెళ్లి కూడా నో యూజ్‌ . స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఓసారి విశాఖ నుంచి, వరదల్లో దెబ్బతిన్న అన‌కాప‌ల్లికి సహాయ కార్యక్రమాలకోసం కొంద‌రు మిత్రుల‌తో క‌లిసి వెళ్లాను. ఆ చుట్టుపక్కల ఊళ్లన్నీతిరిగాం. పదిరోజులున్నాం. సమ్మర్‌ హాలిడేస్‌కి మూసేసిన ఎఎంఎల్ కాలేజీలో మ‌కాం. శారదనదిలో స్నానం. ఎవరైనా పెడితేనే భోజనం...

 

 

IHG

చివరిలో ఒకరోజున తెలిసింది పాపయ్యగారు అక్కడికి దగ్గరలోనే ఉంటారని. ఆ ఊరి పేరు కసింకోట. తెలిసిన మరుక్షణమే అక్కడి నుంచి జంప్‌... ఆ పూట సేవ‌కి డుమ్మాకొట్టి ఓ అద్దె సైకిల్ సంపాదించి, ఒక్కడినే చలో కసింకోట. పదికిలోమీటర్ల దూరం..తీరా వెళ్లాక ఆయ‌న ఏదో ఊరెళ్లార‌నీ, ఇంకో రెండు మూడురోజులు రార‌నీ చెప్పారు. బ్యాడ్‌లక్‌...చేసేదిలేక ఉసూరుమంటూ తిరిగొచ్చాను.

 

IHG

అదొక పాతకాలపు డాబా. పెరటి నిండా చెట్లు. పచ్చగా ఉన్న వాకిలి. గేటు ముందు నిలబడి పాపయ్యగారున్నారా అని అడగటం ఇంకా గుర్తుంది నాకు. ఆయనకి సంబంధించి నాకున్న ఒకే ఒక్క మెమరీ ఇది. ఆ ఇంటి గేటును తప్ప - ఇహలోకంలో అసాధ్యమనిపించే సౌందర్యాన్ని సృష్టించిన, ఆ చేతుల్ని తాకే అవకాశం దొరకలేదు. ప్చ్‌.. ఏం చేస్తాం? ఆ వెలితి అలాగే ఉండిపోయింది.

 

 

IHG

(అప్పుడు అనకాపల్లి వెళ్లిన మిత్రుల్లో ఒకరు ఫోన్‌ చేసి పలకరిస్తే , అప్పటి సంగతులన్నీ నెమరేసుకున్నాం. ఆ సందర్భంగా కసింకోట గుర్తుకొచ్చి, వడ్డాది పాపయ్య గుర్తుకొచ్చి ..)

 

-- మల్లంపల్లి సాంబశివరావు

మరింత సమాచారం తెలుసుకోండి: