ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు పచ్చజెండా ఊపడంతో మందుబాబులు భలేగా ఎగబడ్డారు. రాష్ట్రమంతటా ఒకటే క్యూలు.. కిలోమీటర్ల పొడుగూతా ఒకటే వరుసలు. అయితే.. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఓ మద్యం షాపే.. చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు కొనేవాడే కనిపించడం లేదు. దుకాణంలోని సిబ్బంది తప్పితే ఒక్క కస్టమర్ కూడా కనిపించడం లేదు.

 

 

అంటే ఇదేదో మద్యం నియంత్రణ పట్టణం.. ఆదర్శ పట్టణం అనుకునేరు. అంత సీన్ లేదు. అక్కడ మందుబాబులు ఫుల్లుగా ఉన్నారు. మరి తాగేవాళ్లు ఉండి.. కొన్నాళ్లుగా మందు దొరక్కపోయినా.. వైన్ షాపు ఇలా ఖాళీగా ఉండటమేంటి.. అసలు ఇంతకీ ఇదెక్కడ అంటారా..ఇది అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణంలోని ఓ వైన్ షాపు. ఇక్కడ కొనుగోలుకు ఎవ్వరూ లేక దుకాణ సిబ్బంది గోల్లు గిల్లుకుంటున్నారు.

 

 

మరి ఏమిటీ విధి వైపరీత్యం అంటారా.. ఇది ఏపీ- కర్ణాటక సరిహద్దు ప్రాంతం.. గట్టిగా పది కిలోమీటర్లు వెళ్తే.. మంచి కర్ణాటక బ్రాండ్లు చాలా చౌకగా వస్తాయి. అంతే కాదు.. అక్కడి అధికారులు బల్క్ గా మద్యం కొనేవారికి ప్రత్యేకమైన ప్యాకేజీలు, ఆఫర్లు ఇస్తున్నారట. అందుకే సరిహద్దుల్లోని గ్రామాల్లో కన్నడ రాష్ట్ర మద్యం ఏరులై పారుతోంది. అదే ఆంధ్రప్రదేశ్ మద్యం అయితే లిమిటెడ్ బ్రాండ్లు దొరుకుతున్నాయి. అందులోనూ రేట్లు తెగ పెంచేశారు.

 

 

మరి అందుబాటులో మంచి బ్రాండ్లతో చవగ్గా మద్యం దొరుకుతుంటే.. ఇక ఏపీ మద్యం ఎందుకు అంటున్నారు మడకశిర మందుబాబులు. అందుకే రాష్ట్ర మంతటా మందు దుకాణాలు ఎప్పుడు తెరుస్తారా అని కస్టమర్లు వాటి ముందు పడిగాపులు పడితే.. ఇక్కడ మాత్రం ఎవడో ఒకడు రాకపోతాడా.. ఒకటో, రెండో బాటిళ్లు కొనకపోతారా అని మద్యం దుకాణదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. అదీ మడకశిర మద్యం కథ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: