లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్‌ హోంకే మొగ్గు చూపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్ రోజుల్లోనే ఎక్కువ ఉత్పత్తి సాధించడంతో ఇదే బెటర్ అంటున్నాయి. కేసులు పెరుగుతుండటం... ఇంటి నుంచి పనితో కొంత రిలీఫ్ దొరకడంతో టెక్కీలు సైతం ఇంకొన్ని నెలలు వర్క్ ఫ్రమ్‌ హోం బెటర్ అంటున్నారు. 

 

లాక్‌డౌన్ 55 రోజులు ముగిసిన తర్వాత... కొంత సడలింపులు ఇచ్చాయి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు. వ్యాపార సముదాయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు 33 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. అయితే ఐటీ కంపెనీలు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్‌ హోంలోనే ఉన్నాయి. ఇంకొన్ని నెలలు కూడా ఇదే విధానం తప్పదు అనుకుంటున్నాయి. 


 
వర్క్ ఫ్రమ్‌ హోమ్‌తో ఐటీ కంపెనీలకు అంతరాయం లేకుండా పోయింది. ఈ సమయంలో ఉద్యోగుల పనితీరు మెరుగుపడింది. అనుకున్న దానికంటే ప్రొడక్షన్ ఎక్కువే వచ్చింది. ఈ రోజుల్లోనే మెరుగైన వృద్ధి సాధించాయి. మరికొన్ని నెలలు వర్క్ ఫ్రమ్‌ హోమ్ బెటర్ అని భావిస్తున్నాయి ఐటీ కంపెనీలు. 

 

అయితే కరోనా మహమ్మారి వేలాది మంది ఐటీ ఉద్యోగాలను మింగేయనుంది అనే వార్తలు వచ్చాయి. ఇది ఉద్యోగుల్లో ఆందోళన పెంచింది. ఇంటి నుంచే పనిచేస్తున్నా... చేసే పనిపై ఉద్యోగుల్లో శ్రద్ధ పెరిగింది. ఆఫీస్ హవర్స్‌లో క్యాంటీన్‌లో కొద్దిసేపు, కొలీగ్స్‌తో ముచ్చట్లు, లంచ్ బ్రేక్.. స్నాక్స్‌ బ్రేక్స్‌తో టైం ఇట్టే గడిచిపోయేది. 8 గంటల వర్కింగ్ హవర్స్‌లో కొన్ని గంటలే పని చేసేది. ఐతే...లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అవడంతో... ఉద్యోగులకు పనిపై శ్రద్ధ ఎక్కువైంది. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా... రిలాక్స్ అయ్యే టైం కూడా ల్యాప్‌ట్యాప్‌కే కేటాయించారు టెక్కీలు. 

 

వర్క్ ఫ్రం హోమ్‌తో ఐటీ కంపెనీలకు కరెంట్, వాటర్ బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు, వర్కర్ల జీతాలు, క్యాంటీన్ నిర్వహణ ఖర్చులు మిగిలాయి. ఇంటర్నెట్ భారం కూడా తగ్గింది. ఖర్చులు మిగలడం.. ప్రొడక్షన్‌లో ఎలాంటి మార్పు లేకపోవడంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్‌ హోంవైపే మొగ్గుచూపుతున్నాయి. మరోవైపు... విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్లు, విదేశీ ప్రాజెక్టులపై పనిచేస్తున్న వాళ్లు ఉండటంతో... ఆయా దేశాల్లో పరిస్థితి ఇంకా చక్కదిద్దుకోలేదు. దీంతో...ఇంకొన్ని నెలల పాటు ఉద్యోగులను ఇంటికే పరిమితం అవ్వాలని చెప్పిన సంస్థలు కూడా ఉన్నాయి.

 

మరోవైపు... హైదరాబాద్ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో టెక్కీలు సైతం వర్క్ ఫ్రమ్‌ హోం బెటర్ అనే భావిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు నుంచే వర్క్ ఫ్రమ్‌ హోమ్ విధానాన్ని ప్రారంభించిన ఐటీ కంపెనీలు... ఈ ఏడాదంతా ఇదే విధానం మంచిదని భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: