దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 61 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే నాలుగున్నర లక్షల కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 61 వేల 408 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 31 లక్షల 6 వేల 348కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 23లక్షల 38వేల మంది కోలుకోగా మరో 7లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 836మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 57 వేల 542కి చేరింది.

దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో మరో  57వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 75శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల శాతం 23.4 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.86 శాతంగా ఉంది.

ఆగస్ట్ నెలలో దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత భారీగా పెరిగింది. గడిచిన వారం రోజుల్లోనే దేశంలో నాలుగున్నర లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు.. 6 వేల 600మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 20 నుంచి 30లక్షల కేసులకు చేరడానికి 15రోజుల సమయం పట్టింది. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి దాదాపు 22రోజుల సమయం పడుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెంచడంతో.. పాజిటివ్‌ కేసులు భారీగా బయటపడుతున్నాయి.  ప్రస్తుతం కరోనా కేసుల పాజిటివిటీ రేటు 8.6శాతంగా ఉంది.

ఆదివారం దేశవ్యాప్తంగా 6లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి, ఐసీఎంఆర్  వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 3కోట్ల 59లక్షల శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఈ నెల 21వ తేదీన ఒక్కరోజే రికార్డుస్థాయిలో 10లక్షల 23వేల పరీక్షలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: