భారత రాజ్యాంగం బహు గొప్పది. ఏ ఒక్కరి చేతిలోనో అపరిమితమైన అధికారాన్ని పెట్టకుండా దాన్ని జాగ్రత్తగా అన్ని వైపులా పంచింది. అన్ని వ్యవస్థలూ  సమానమే అని నిరూపిస్తూ సమిష్టి నిర్ణయానికే ఓటేసింది. ఆ స్పూర్తి అలా కొనసాగుతూండబట్టే ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య సౌధానికి బీటలు వారలేదు. గొప్పగా ప్రకాశిస్తోంది.

ఏపీలో చూసుకుంటే రెండు రాజ్యాంగ‌ బధ్ధ వ్యవస్థల మధ్య పేచీ ఏడాదిగా సాగుతోంది. గత మార్చి 15న హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేసి ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరే ఆ సమయంలో ప్రభుత్వంతో సంప్రదించాల్సిందే. కానీ చేయలేదు. కానీ ఇక్కడే ప్రభుత్వం పప్పులో కాలేసింది.

నిమ్మగడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. సీఎం స్థాయి నుంచి మొదలుపెట్టి మంత్రులు ఎమ్మెల్యేల దాకా  ఆయన మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కానీ నిమ్మగడ్డ వ్యక్తి కాదు, ఇక వ్యవస్థ. దానిని కోర్టులు అనేక మార్లు టీకా తాత్పర్యంతో సహా తెలియచేసినా ప్రభుత్వ పెద్దలు ఎక్కడా తగ్గలేదు. ఈ రోజు వరకూ న్యాయ స్థానాలలో  పోరాటం చేస్తూనే ఉన్నారు.  చివరికి తేలిందేంటి అంటే రాజ్యంగ వ్యవస్థలు బహు గొప్పవని.

మొత్తానికి ఎంత చేసినా ఏమి చేసినా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆద్వర్యంలో జరుగుతున్న ఎన్నికల పోరులో వైసీపీ పాల్గొని తీరాల్సిందే. ఇంత జరిగినా కూడా ఎన్నికల సంఘం అధికారాలు తెలియకపోయినా, ఇంకా ఎవరైనా తెలుసుకోకపోయినా కూడా మరిన్ని ఇబ్బందులకు గురి కాక తప్పదు. ఏపీలో ఇపుడు  వైసీపీ రాజకీయ పోరుకు సిధ్ధం కావాల్సిందే. ఎన్నికలో విజయం కోసం రెడీ కావాల్సిందే. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీకి  ఆయాసం ఆరాటం తప్ప చివరికి మిగిలింది ఏంటి అంటే సమాధానం శూన్యం.  మొత్తానికి ఎన్నికల పోరాటం ఏపీలో మొదలైపోయింది. విజేతలను ప్రజా న్యాయ స్థానం నిర్ణయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: