బాబోయ్.. చైనా హ్యాకర్ల గుప్పిట్లోకి ఇండియా వెళ్లిందా.. అసలు ఏం జరుగుతోంది..? ఇప్పుడు ఇండియాలోని పరిస్థితులు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. గత ఏడాదిలో జరిగిన ముంబయి పవర్ గ్రిడ్‌ ఘటనకు చైనా హ్యాకర్లే కారణమన్న వాస్తవం క్రమంగా భయాందోళనలు కలిగిస్తోంది. ఆ వార్త జీర్ణించుకునే లోపే మరోవార్త.. ఇండియాలోని వ్యాక్సిన్లకు సంబంధించిన సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సర్వర్లను కూడా చైనా హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రయత్నం చేశారన్నది మరో పిడుగులాంటి వార్త.

దీని వెనుకే.. తెలంగాణలోని విద్యుత్ వ్యవస్థలపైనా చైనా హ్యాకర్లు దాడికి ప్రయత్నించారంటూ మరో వార్త. ఇలాంటి వార్తలు వరుసగా వింటుంటే.. అసలేం జరగబోతోందన్న ఆందోళన కనిపిస్తోంది. అందులోనూ.. అవును నిజమే.. హ్యాకర్లు పవర్ గ్రిడ్‌ను హ్యాక్ చేసేందుకు చేసిన ప్రయత్నం నిజమే అని ఏకంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే అంగీకరించడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఇంతలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి మరో బాంబు పేల్చారు.

ఈ హ్యాకర్ల వ్యవహారం ముంబయి పవర్ గ్రిడ్‌కు మాత్రమే పరిమితం కాదని ఆయన మరో బాంబు పేల్చారు. ఈ అంశంపై రాజకీయం చేయడం ఇష్టం కాదని.. కానీ వాస్తవాలను అంగీకరించి తీరారని ఆయన చెబుతున్నారు.  ఆయన చెబుతున్న దాన్ని బట్టి చూస్తే.. ఈ సైబర్ దాడులు ఇంకా చాలా రంగాల్లో జరిగాయేమో అన్న ఆందోళన కలుగుతోంది. అసలు ఈ చైనా హ్యాకర్లు ఇంకా ఎన్ని రంగాలపై కన్నేశారు.. వారు ఎంతవరకూ ఈ అంశాల్లో విజయవంతం అయ్యారు అనే అంశాలు భయపెడుతున్నాయి.

సున్నితమైన అంశం కాబట్టి కేంద్రం కూడా అన్నీ వాస్తవాలే చెప్పే అవకాశం లేదు. కానీ.. ఈ పరిస్థితులను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే.. పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వాడకం పెరిగింది. ఇదే సమయంలో ఇలాంటి హ్యాకింగ్ ప్రమాదమూ పెరిగింది. హ్యాకింగ్‌ ను సమర్థంగా అడ్డుకునే వ్యవస్థలను.. విదేశీ హ్యాకర్లను గుర్తించి అడ్డుకునే వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వరుస ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: