చైనా.. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం కోసం సీరియస్‌గా పోటీపడుతోంది. అమెరికాను అన్ని రంగాల్లో అధిగమించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే అనేక రంగాల్లో తన సామర్థ్యానికి పదును పెడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో సత్తా చాటుతోంది. తాజాగా చైనా చేసిన ఓ ప్రయోగం.. ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకే షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ ప్రయోగం ఏంటంటే.. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఓ కొత్త హైపర్‌ సోనిక్‌ క్షిపణిని చైనా పరీక్షించింది. చైనా ప్రయోగించిన ఈ క్షిపణి భూ కక్ష్యలో పయనిస్తూ మొత్తం భూమిని చుట్టేసింది.


అంతే కాదు.. ఈ ప్రయోగం జరిగింది ఇప్పుడు కాదు. గత ఆగస్టులో.. అయినా ఆ విషయాన్ని చైనా రహస్యంగా ఉంచింది. అయితే ఈ క్షిపణి ప్రయోగంలో చిన్న అపశ్రుతి దొర్లింది. భూ ప్రదక్షిణం పూర్తయ్యాక శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లినా కొద్దిలో గురి తప్పింది. కానీ.. ఇలాంటి ప్రమాదకరమైన క్షిపణి రూప కల్పనలో ఈ ప్రయోగం ద్వారా చైనా సత్తా చాటిందనే చెప్పాలి.

క్షిపణి రంగంలో చైనా సాధించిన ఈ ప్రగతి చూసి అమెరికా నిఘా వర్గాలు షాక్‌ తిన్నాయి. చైనా  తమ అంచనాలను మించి దూసుకెళ్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయాయి. ఈ పరీక్ష ఆగస్టులోనే జరిగినా.. చైనా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచినా.. మొత్తానికి ఈ క్షిపణి ప్రయోగం విషయం బయటకు పొక్కింది. పూర్తి అవగాహన ఉన్న అధికారులు ఈ విషయాన్ని లీక్ చేశారు. అమెరికా నిఘా సంస్థలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నాయి.


ఓవైపు చైనా, అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఈ క్షిపణి ప్రయోగం చేయడం విశేషం. అయితే ఈ క్షిపణి ఏంటి.. దాని వల్ల ఉపయోగాలేంటి.. చూద్దాం..
ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం అంటే గంటకు 6,200 కిలోమీటర్ల వేగంతో వెళ్తే దాన్ని  హైపర్‌సోనిక్‌ క్షిపణి అంటారు. ఈ క్షిపణులను రాకెట్‌ సాయంతో ప్రయోగిస్తారు. ఇప్పుడు చైనా సరికొత్తగా అందుకున్న ఈ పరిజ్ఞానంతో చైనా ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్నైనా.. తన క్షిపణులతో పేల్చే సత్తా సంపాదించుకున్నట్టు నిరూపణ అయ్యింది. ఇదే ఇప్పుడు అమెరికాకు కంటగింపుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: