ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ అటెండెన్సును తప్పనిసరి చేశారు. ఈ మేరకు.. బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాల రాజు మెమో జారీ చేసారు. కొవిడ్ 19  ఉధృతి అనంతరం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలోబయో మెట్రిక్ అటెండెన్స్ ను తప్పనిసరి చేస్తోంది ఏపీ సర్కారు. ఈ విషయాన్నే మెమోలో ప్రభుత్వం పేర్కొంది.  ఉద్యోగులందరికీ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని 2022 జూన్ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అందుకే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ ఉద్యోగుల హాజరును పరిశీలించాల్సిందిగా ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 10 గంటల 10 నిముషాల అనంతరం విధులకు వస్తే ఆలస్యంగా హాజరైనట్టు పరిగణిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయ మాన్యువల్ ప్రకారం నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా హాజరును అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకూ విధుల్లో ఉంటేనే పూర్తి హాజరుగా పరిగణిస్తామని సాధారణ పరిపాలన శాఖ చెబుతోంది.


అయితే ఇలా తప్పనిసరి ఉత్తర్వులు జారీ కావడం ఇదేమీ కొత్త కాదు.. గతంలోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ అయినా.. సక్రమంగా అమలుకాలేదు. మరి ఇప్పుడు మాత్రం సరిగ్గా అమలవుతాయా అన్న అనుమానాలు లేకపోలేదు. కానీ.. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధనలు కాళ్లకు బంధనాలుగానే మారే అవకాశం ఉంది. అందులోనూ సరిగ్గా పది నిమిషాలు ఆలస్యం అయినా ఆలస్యంగా నమోదవడం.. బయోమెట్రిక్ తప్పనిసరి అని చెప్పడం అంటే.. వారికి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు.


శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. మరి దీనికి కూడా సచివాలయ ఉద్యోగులు ఏదో ఒక మార్గం కనిపెట్టకుండా ఉంటారా.. అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: