ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. 2014 ఎన్నికల సమయంలో పోటీ చేయనప్పటికీ... బీజేపీ, టీడీపీలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర కూడా పోషించారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీతో విభేధించారు. ఇక బీజేపీకి కూడా దూరమయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఇక ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు పవన్. ఇదే సమయంలో మరోసారి పవన్‌తో దోస్తీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికలకు రెండేళ్లు గడువున్న నేపథ్యంలో... ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేసింది. సర్వే సంస్థలను రంగంలోకి దించింది సైకిల్ పార్టీ. జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు కంకణం కట్టుకున్నాయి. టార్గెట్ వైసీపీ అంటూ మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... అనూహ్యంగా ఓడిపోయారు. అయితే... ఎలాగైనా మంగళగిరి నుంచి గెలిచేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న లోకేష్... జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుంచనపల్లిలో పలువురు నేతలు, టీడీపీ కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇదే సమయంలో అక్కడ స్థానిక జనసేన నేతలు కార్యకర్తలతో కూడా లోకేష్ సమావేశమయ్యారు. తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శివ నాగేంద్ర ఇంటికి వెళ్లి లోకేశ్ పలకరించారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పని చేయాలని అంటూ లోకేశ్ ప్రతిపాదించారు. ఏ సమస్య వచ్చినా సరే... నేరుగా తనను స్వయంగా కలవాలని సూచించారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని లోకేశ్ పరిశీలించారు కూడా. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: