గ‌త ప్ర‌భుత్వం టీడీపీది. అంటే చంద్ర‌బాబు హ‌యాంలో ఉన్న పాల‌న రోజుల‌కు వెళ్లి, ఆ రోజు జ‌రిగిన త‌ప్పిదాలు త‌రచి చూస్తే ఇప్ప‌టి పాల‌న ఎలా ఉందో త‌ప్ప‌క అర్థం అవుతుంది. అదేవిధంగా ఆ రోజు అసెంబ్లీలో చంద్ర‌బాబు వ‌ర్గం న‌డుచుకున్న విధానం ఒక్క‌సారి త‌లుచుకుంటే ఇప్పుడు వైసీపీ ఏ విధంగా సెష‌న్ లో ప్ర‌వ‌ర్తిస్తుంది అన్న‌ది కూడా సుస్ప‌ష్టంగా తెలియ‌వ‌స్తుంది. ఆ రోజు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో అప్ప‌టి నాయ‌కులు చేయ‌ని త‌ప్పు లేదు. ఆ రోజు అధికారంలోకి రాగానే టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. క‌బ్జాలు చేశారు. అడ్డు వ‌చ్చిన వారిని బెదిరించారు. ఇవి ఇలా న‌డుస్తుండ‌గానే రాజ‌ధాని పేరిట ఒక హుండీ తెరిచి చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాజ‌ధాని కి చెందిన సెక్ర‌టేరియ‌ట్ కేంద్రంగా ఓ పెద్ద రాజ‌కీయ ప్ర‌హ‌స‌నానికే తెర‌లేపారు. ఆ త‌రువాత చాలా జ‌రిగాయి.


రాజ‌ధాని కోసం భూములు కొంద‌రే స్వ‌చ్ఛందంగా ఇస్తే ఇంకొంద‌రు మాత్రం ఇచ్చేందుకు అంగీకారం ఇవ్వ‌కున్నా బ‌ల‌వంతంగా లాక్కొన్నారు అన్న అభియోగం ఇవాళ్టికీ టీడీపీ మోస్తూనే ఉంది. అంతేకాదు సెష‌న్ లో విప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు చాలా మంది టీడీపీ నాయ‌కులు హేళ‌న చేశారు. అవ‌మానించారు. ఇదే సంద‌ర్భంలో వైసీపీ స‌భ్యులు కూడా తామేం త‌క్కువ కాద‌న్న విధంగానే ప్ర‌వ‌ర్తించి స‌మావేశాలు బ‌హిష్క‌రించి వ‌చ్చేశారు. కాల చక్రం గిర్రున తిరిగింది. రెండున్నరేళ్ల‌లో జ‌గ‌న్ సాధించింది  ఏముంద‌ని ఆలోచించాలి. జ‌గ‌న్ ఈ కొద్దిపాటి కాలంలో లెక్క‌కు మిక్కిలి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం మిన‌హా పెద్ద‌గా సాధించింది ఏమీ లేదు. రెండు ప్ర‌భుత్వాలూ సాగునీటి ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌ను పెద్ద‌గా పట్టించుకోలేదు.



చంద్ర‌బాబు హ‌యాంలో వంశ‌ధార నిర్వాసితుల స‌మ‌స్య‌ను పూర్తిగా రాజ‌కీయం చేయాల‌న్న త‌లంపులో భాగంగానే వైసీపీ ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. అదేవిధంగా అనేక స‌మ‌స్య‌ల‌పై ఆ రోజు వైసీపీ క‌లెక్ట‌రేట్ ల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపి అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా అదే బాట‌లో ఉంది. విప‌క్ష సభ్యులు అంతా వైసీపీని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు వైసీపీ చేసిన‌న్ని దీక్ష‌లు టీడీపీ చేయ‌లేదు. ఇక అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ మాదిరిగానే వైసీపీ మనుషులు రౌడీయిజం చేస్తూనే ఉన్నారు. భూ క‌బ్జాల‌కు లోటేలేదు. విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న భూ క‌బ్జాల‌కు ఆధారాలున్నా వాటిని నిలువ‌రించే స్థాయి లో సీఎం లేరు. ఆ రోజు నారాయ‌ణ అనే పుర‌పాల‌క శాఖ మంత్రి మ‌రియు నారా లోకేశ్ అనే మంత్రి తెగ హ‌డావుడి చేస్తే ఇప్పుడు మాత్రం సాయిరెడ్డి, పెద్దిరెడ్డి చక్రం తిప్పుతున్నారు. సాయిరెడ్డి కొద్దిగా కంట్రోల్ అయినా కూడా పెద్ది రెడ్డి హ‌వాకు అంతేలేదు. ఆ రోజు ఈ రోజు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అనే పార్టీ పెద్ద అన్నీ తానై కొన్ని విష‌యాల్లో ఉంటున్నా, కొన్ని నిర్ణ‌యాల్లో జ‌గ‌న్ ను కూడా ఏమీ ప్ర‌భావితం చేయ‌లేని నిస్స‌హాయ‌త‌లో ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఈరోజు మా ప్రాంతాల‌కు తీవ్ర తుఫానులు వెన్నాడాయి. అప్పుడు హుద్ హుద్, తిత్లీ వెన్నాడితే ఇప్పుడు గులాబ్,జ‌వాద్ అత‌లాకుతలం చేశాయి. అయితే పంట న‌ష్టాల చెల్లింపుల్లో ఆ రోజు ఈ రోజు రెండు ప్ర‌భుత్వాలు రైతుల‌కు పూర్తి స్థాయిలో చేసిన న్యాయం ఏమీ లేదు అన్న‌ది సుస్పష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: