పీఆర్సీ పోరులో ఉద్యోగులే విజ‌యం సాధించారు.ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది.అదేవిధంగా సీపీఎస్ ర‌ద్దుపై కూడాస్ప‌ష్టం అయిన ప్ర‌క‌ట‌న చేశారు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.దీంతో కొత్త పీఆర్సీకి సంబంధించి లైన్ క్లియ‌ర్ అయింది. ఫిట్మెంట్ ను మాత్రం తాము పెంచ‌లేమ‌ని చెప్పారు.కానీ అద్దె భ‌త్యాల శ్లాబును మాత్రం కొద్దిగామార్చారు. అంతేకాదు జ‌న‌వ‌రి  నుంచి హెచ్ ఆర్ ఏ చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చాయి ప్ర‌భుత్వ వ‌ర్గాలు.చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృతం కావ‌డంతో ఇక స‌మ్మె నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకున్నామ‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌క‌టించి తీవ్ర ఉత్కంఠ‌త‌కు తెర దించాయి.

ఆంధ్రావ‌ని వాకిట పీఆర్సీ అమ‌లు త‌దిత‌ర నిర్ణ‌యాలపై గ‌త కొద్దికాలంగా న‌లుగుతున్న వివాదం ఇవాళ ముగిసింది.మంత్రుల క‌మిటీతో చ‌ర్చ‌లు జ‌రిగిన అనంత‌రం ఉద్యోగ సంఘాల‌తో క‌లిసి ప్ర‌భుత్వ పెద్ద రామ‌కృష్ణా రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి క్లారిఫికేష‌న్ ఇచ్చారు. దీంతో స‌మ్మె లేద‌నే తేలిపోయింది.ఈ  నేప‌థ్యంలో సజ్జ‌ల మాట్లాడుతూ ఫిట్మెంట్ ను23 శాతం మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌మ‌ని అయితే అద్దె భ‌త్యం శ్లాబులు ప‌ది శాతం నుంచి పెంచుకుంటూ వ‌చ్చామ‌ని  అన్నారు. జ‌నాభా ప్ర‌తిప‌దికన ప‌ది శాతం, 12 శాతం,16 శాతం ఇచ్చేందుకు అదేవిధంగా స‌చివాల‌య ఉద్యోగుల‌కు 24శాతం హెచ్ ఆర్ ఇచ్చేందుకు సుముఖత వ్య‌క్తం చేశారు.


ఇదే సంద‌ర్భంలో ఐఆర్ రిక‌వరీ ఉండద‌ని, రిటైర్మెంట్ వేళ‌లో అద‌నంగా ఇచ్చిన మొత్తాల‌కు కోత విధిస్తామ‌ని అన్నారు.అదేవిధంగా ఉద్యోగుల‌కు సంబంధించి సీసీఏ అలానే ఉంటుంది అని కూడా స్ప‌ష్టం చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ పై కూడా ఓ క్లారిఫికేష‌న్ ఇచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికీ చొర‌వ చూపుతామ‌ని చెప్పారు.సీపీఎస్ కు సంబంధించి స్ప‌ష్ట‌మైన టైం బౌండ్ తో ఈ ఏడాది మార్చిలోగానే ఏదో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. అదేవిధంగా గ‌తంలోచెప్పిన విధంగా కాకుండా ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి పీఆర్సీ వేయ‌నున్నామ‌ని స్ప‌ష్టం చేసి ఉద్యోగుల అనుమానాలు తీర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp