
పాక్ స్వాతంత్ర్యం తర్వాత తాను మొదటి తరం ప్రతినిధినని గుర్తు చేసిన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ తన కంటే కేవలం ఐదేళ్లు మాత్రమే పెద్దదన్నారు. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడు.. దేనిపైనా వ్యామోహం లేదని.. అధికారం నిలబెట్టుకునేందుకు ఎవరి ముందు తలొగ్గే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇమ్రాన్‌ఖాన్ సర్కారుపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టగా.. దాన్ని వెనక్కి తీసుకునేలా ఇమ్రాన్ ఖాన్ అన్ని ప్రయత్నాలు చేశారు. అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకుంటే పార్లమెంటు రద్దు చేస్తానని కూడా ఇమ్రాన్ హామీ ఇచ్చారు.
అయితే.. ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్రతిపాదననను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. దేశం ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉందన్నారు. తమ ముందున్న రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌కు తలెత్తిందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. అసలు నా లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడా? అనిపిస్తుందన్న ఇమ్రాన్.. తనకు దేవుడు డబ్బు, మంచి జీవితంతో పాటు అన్నీ ఇచ్చాడన్నారు.
తనకు జీవితంలో ఎలాంటి దానిపై వ్యామోహం లేదని.. పాకిస్థాన్‌కు సంబంధించి ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. తన పూర్వీకుల విజన్ సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న ఇమ్రాన్ ఖాన్.. తన చిన్నతనంలో పాక్ ఉన్నతస్థానంలో ఉండేదని గుర్తు చేసుకున్నారు. తాను మలేషియా రాజకుమారులతో కలిసి చదువుకున్నానని.. ఉన్నత స్థానం నుంచి పతనం వరకు పాకిస్థాన్‌ను చూశానని అన్నారు.