సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఆయన పోటీ చేసిన సంగతి తెలిసిందే. అదే నియోజకవర్గంలో బీఎస్పీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి గారు. వీరిద్దరూ ఓడిపోయినప్పటికీ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలవడం వల్లే ఓట్లు చీలి తాను ఓడిపోయానని కొనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరడంతో కోనప్ప ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఆయన గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పైన తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు.

ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కొనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు హామీలు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ తాజాగా ఓ సమావేశంలో మళ్లీ కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం హామీ ఇచ్చినా కౌటాల బ్రిడ్జికి అనుమతి రాలేదన్నారు. బీఆర్ఎస్ హయంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కొనప్ప డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను కొనసాగిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంచార్జ్ మంత్రి సీతక్కకు సైతం చెప్పామని ఆమె సరే అన్నారని కానీ ఒక్క రోడ్డు కూడా రాలేదని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయని తనకు పార్టీలో గౌరవం దక్కడం లేదని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గం పైన కూడా కాంగ్రెస్ కు ప్రేమలేదని చెప్పారు. గ్రూప్ రాజకీయాలు చేస్తూ తమను ఇబ్బంది పెడుతూ కించపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు.  త్వరలోనే ఆయన చింతలమానపల్లిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాకుండా తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: