ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అన్ని వనరులను సమానంగా పంచుకునేవారు. కానీ 11 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ఒక రాష్ట్రం రెండుగా చీలిందో అప్పటినుంచి.. భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాల పంపకాల్లో కూడా తమ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే నీళ్లపై గొడవ మళ్ళీ తెర మీదకు వచ్చింది. గోదావరి, కృష్ణా జలాల విషయంలో రెండు ప్రాంతాల మధ్య ఎప్పటినుంచో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది చివర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. దీంతో రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని కూడా ఆయన తెలిపారు.  కానీ ప్రస్తుతం అదే ఆంధ్ర - తెలంగాణ మధ్య నడుస్తున్న హాట్ టాపిక్ బనకచర్ల ప్రాజెక్టు. మూడు నదులను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని వార్తలు వ్యక్తమవుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువగా కురిసినా.. అవి సాగుకు వాడుకోలేని పరిస్థితి. రాయలసీమలో కరువు ఏర్పడుతుంది. దీంతో గోదావరి బేసిస్ నుంచి నీళ్లను తీసుకొచ్చి.. పెన్నా బేసిన్లో కలపాలని ఆంధ్రప్రదేశ్ కొత్తగా ప్లాన్ చేసింది. అంతేకాదు ఈ కొత్తగా నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి అయి భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు తెలిపారు. అంతేకాదు ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను ఉమ్మడి నెల్లూరు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసింది.

80 కోట్ వేలకోట్లతో చేపట్టే ఈ బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించాలని చూస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం 48,000 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 12 వేల ఎకరాలు అటవీ భూమి కూడా ఉంది .అంతేకాదు ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి నాలుగువేల మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం తమ నివేదికలో తెలిపింది. రెండు చోట్ల టన్నేళ్లు, 9 చోట్ల పంపు హౌసులు నిర్మించాలి.  అవసరమైన చోట గ్రావిటీ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణ నది రివర్ బోర్డులను కేంద్ర జల శక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల సంఘం లేఖ రాసింది.  దీనిపై cwc తెలంగాణకి కూడా లేఖ రాసి ఆ రాష్ట్రం అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపిస్తామని కూడా తెలిపింది. అయితే ఇక్కడే అసలు చిక్కు ఏర్పడింది.

బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జల వివాదం ట్రైబునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది కూడా.. ఇక ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ ను  వినియోగించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుపడుతూ.. ఒక సమావేశం నిర్వహించి, గోదావరి, కృష్ణ బోర్డులతో పాటు కేంద్ర జల శక్తి శాఖ, కేంద్ర జల వనరుల సంఘానికి లేఖలు రాశారు. ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు,  జల్ శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు కూడా లేఖలు రాశారు. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: