
అశోక్ గజపతి రాజు టీడీపీ స్థాపన దశ నుంచే పార్టీతో ఉన్నారు. వివాద రహితుడిగా, క్రమశిక్షణ గల నాయకుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్ వల్లే కేంద్రం మరోసారి ఆయనపై దృష్టి పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈసారి బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేతకు గవర్నర్ హోదా ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యనమల రామకృష్ణుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్లు చర్చలో వినిపిస్తున్నాయి. యనమలకు రాజ్యసభ సీటు సమీకరణలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి గవర్నర్ రేసులో కృష్ణమూర్తి పేరు బలంగా వినిపిస్తోంది. కృష్ణమూర్తి రాజకీయ అనుభవం విస్తృతంగా ఉన్నప్పటికీ, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల క్రియాశీలక రాజకీయాల నుంచి కొంత వెనక్కి తగ్గారు.
అయితే ఆయన సీనియారిటీ, సామాజిక వర్గ ప్రాతినిధ్యం దృష్ట్యా ఆయన పేరు బలంగా పరిశీలనలో ఉందని అంటున్నారు. మరోవైపు, రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వర్గ నేతను గవర్నర్‌గా నియమించే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. ఇది ప్రాంతీయ సంతులనం, సామాజిక సమీకరణలకూ ఉపయోగపడుతుందని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక బిహార్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న సంకేతాలు కూడా రావడంతో, జాతీయస్థాయిలో టీడీపీకి మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. చివరికి గవర్నర్ హోదా ఎవరి ఖాతాలో పడుతుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.