ప్రకాశం జిల్లా...కొండపి నియోజవర్గం.. ఇక్కడ ప్రజలకు రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ. 2009కు ముందు వ‌ర‌కు జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఉన్న కొండ‌పి ఆ త‌ర్వాత రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిలోకి మారింది. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ నుండి గెలుపొందింది. 2014 ఎన్నికలకొచ్చేసరికి టీడీపీ నుండి డోలా బాల వీరాంజనేయస్వామి విజయం సాధించారు. అప్పటి వైసీపీ నేత...ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఓటమి పాలయ్యారు.


ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ స్వామి టీడీపీ నుండి పోటీ చేస్తుండగా..వైసీపీ నుండి డాక్టర్ వెంకయ్య బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల హాట్ ఫైట్ జరుగుతుంటే ఇక్కడ మాత్రం సైలెంట్ వార్ జరుగుతుంది. మరి ఈ సారి సైలెంట్ వార్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో చూద్దాం.
గత 10 ఏళ్లుగా స్వామి ఎలాంటి మ‌చ్చ‌లేకుండా కొండ‌పిలో ఆద‌ర్శ రాజ‌కీయం చేస్తున్నారు. సౌమ్యుడుగా, మంచి వ్యక్తి కావడంతో ప్రజలకు స్వామిపై అభిమానం ఎక్కువ ఉంది. క్షేత్రస్థాయిలో చూసుకుంటే టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అటు అభివృద్ధి అంతగా లేకపోయిన...సంక్షేమ పథకాలు మాత్రం ప్రజలకు అందాయి. అటు దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు ఈ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహించి జిల్లాలో చెరగని ముద్ర వేశారు.


ఆయన రాజకీయ వారసులుగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌, కొండపిలో కీలక నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్య ఉన్నారు. కానీ ఇటీవల వీరికి స్వామికి విభేధాలు బాగానే ఉన్నట్లు కనిపించాయి. కానీ వాటిని సీఎం తగ్గించారు. దామచర్ల కుటుంబాన్ని స్వామికి మద్ధతు తెలపాలని చెప్పారు. దీంతో దామచర్ల వర్గం మద్ధతు పలికితే స్వామి విజయం సులువే.


మరోవైపు వైకాపాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జూపూడి ప్రభాకర్‌ తెదేపాలో చేరారు. తర్వాత ఇన్‌ఛార్జిగా వచ్చిన అశోక్‌బాబు కొంతకాలంగా పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ చివరికి అశోక్‌ని కాదని డాక్టర్ వెంకయ్యకి జగన్ సీటు ఇచ్చారు. దీంతో అశోక్ రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉంటానంటూ ప్రకటించి, క్షేత్రస్థాయిలో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఇది పార్టీకి నష్టమే. ఇక జగన్‌కి పెరిగిన ప్రజాబలం... ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం పార్టీ గెలుపుకి సహకరిస్తాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఇక్కడకి కొంచెం టీడీపీకే ఎడ్జ్ కనపడుతుంది. మరి చూడాలి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో...


మరింత సమాచారం తెలుసుకోండి: