పాలిటిక్స్‌లో మార్పు తేస్తాను, ప్రశ్నిస్తాను అని ప్రగల్భాలు పలికిన జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు ముందే ఇప్పటికే బ్రష్టు పట్టిపోయిన రాజకీయాలను మరింత కలుషితం చేసేసిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు తన పార్టీలో సీట్లు ఇవ్వనని, రాజకీయ వారసత్వాన్ని తాను ప్రోత్సహించనని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన పవన్‌ చివరకు తాను చెప్పిన మాటలను పూర్తిగా తప్పారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి, ఆర్థికంగా డబ్బు ఉన్న వారికి సీట్లు ఇచ్చిన పవన్‌ ఈ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో అయినా గెలిచే వారికి సీట్లు ఇచ్చారా ? అన్నది ప్రశ్నించుకుంటే ఖ‌చ్చితంగా నో అన్న ఆన్సరే వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే పవన్‌ తాను గెలవడం కంటే తాను అంతర్గతంగా కమ్మక్కు అయిన పార్టీ అధినేతను గెలిపించుకునేలా తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. 


రాజకీయాల్లో డబ్బు సంస్కృతికి పూర్తిగా విరుద్ధమ‌ని, ప్రశ్నిస్తానని పదే పదే చెప్పిన పవన్‌ ఈ రెండిటి విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇక పవన్‌ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడంతోనే పవన్‌కు ఒక నియోజకవర్గంలో గెలుస్తానన్న నమ్మకం లేకే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారన్న ప్రచారం సైతం ఆయన చర్యలకు ఊతమి ఇచ్చేలాగానే ఉంది. కుల సంస్కృతికి పదే పదే వ్యతిరేఖం అని గొప్పలు చెప్పే పవన్‌ కళ్యాణ్‌ ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకర్గాల్లోనూ ఆయన సామాజికవర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. కాపు సామాజికవర్గం ఓట‌ర్లు ఎక్కువగా ఉన్న రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పవన్‌ ఎమ్మెల్యేగా గెలిచేందుకే చాలా చాలా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడన్నది చిన్న పిల్లాడికైనా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక తాజాగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనే పవన్‌ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు తెంపి మరీ ఉద్యోగులకు పంచారు. 


పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య‌ ట్రయాంగిల్‌ పైట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ ఇప్పటికే భారీగా డబ్బులు వెదజల్లుతున్నాయి. తాజాగా భీమవరం నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుని ఉద్యోగులకు టీడీపీ, వైసీపీ ఓటుకు రూ. 2000/- చొప్పున పంచగా జనసేన సైతం తామేం తక్కువ తిన్నామని ఓటుకు రూ. 2000/- పంచింది. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఉద్యోగికి మూడు పార్టీల‌ నుంచి రూ. 6000/- ఇప్పటికే గిట్టుబాటు అయ్యింది. దీనిని బట్టీ భీమవరంలో ధన ప్రవాహం ఏ రేంజులో ఉందో స్పష్టంగా తెలుస్తోంది. సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేస్తామంటూ పదే పదే గొప్పలుపోయే పవన్‌ చివరకు మేము కూడా ఆ తానులో ముక్కలమే అంటూ తాను పోటీ చేస్తున్న చోట ప్రధాన పార్టీలకు సమానంగా డబ్బు పంచి మరీ ఓట్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. భీమవరంలో గెలుపుపై నమ్మకం లేక పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఈ రేంజులో కొన్న పవన్‌ రేపు సాధారణ ఓటర్లు కొనుగోలుకు ఎన్ని జిమ్మిక్కులు చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: