’ఏడాదిగా ప్రయత్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని కలవటం కుదరలేదు’ ఇది తాజాగా సిఎంతో భేటి అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు. బహుశా తన వ్యాఖ్యలను జనాలు నమ్ముతారన్న నమ్మకం చిరంజీవికి కూడా ఉన్నట్లు లేదు. లేకపోతే జగన్ కలిసిన విషయం ఏమిటో చెప్పకుండా ఏడాదిగా ప్రయత్నిస్తున్నా కలవటం కుదరలేదని వివరణ ఇచ్చుకోవటం ఎందుకు ?  మొత్తానికి కరోనా సంక్షోభంలో కలవక తప్పదు కాబట్టే ఇపుడైనా వచ్చి సినీ ప్రముఖులు కలిసినట్లున్నారు.

 

తెలుగుసినిమా ఫీల్డుకు తెలుగుదేశంపార్టీతో విడదీయరాని సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే.  టిడిపి వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ స్వయంగా సినీఫీల్డు నుండి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీయార్ వల్ల కావచ్చు లేదా తర్వాత సిఎం అయిన చంద్రబాబునాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కూడా కావచ్చు ఫీల్డులోని మెజారిటి ప్రముఖులు టిడిపితో సన్నిహితంగా ఉంటారు. అదే సమయంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఫీల్డులోని ప్రముఖులు ప్రభుత్వంతో మంచి సంబంధాలనే కొనసాగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ఫీల్డులోని మెజారిటి ప్రముఖులు మొహం చాటేశారు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అదికూడా కరోనా వైరస్ సంక్షోభం బ్యాక్ గ్రౌండ్ సందర్భంగా  కొందరు వచ్చి సమావేశం అవటం గమనార్హం. మంగళవారం సాయంత్రం సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి సురేష్ బాబు, రాజమౌళి తదితరులు జగన్ తో భేటి అయ్యారు. ఏపిలో షూటింగ్ లకు అనుమతి, థియేటర్లో టిక్కెట్ల రేట్లు, విశాఖపట్నంలో భూముల అభివృద్ధి (ఫీల్డును హైదరాబాద్ నుండి వైజాగ్ వైపు షిఫ్టు చేయుట) తదితరాల కోసమని ప్రముఖులు భేటి అయ్యారు జగన్ తో. ఇపుడు కూడా వాళ్ళ అవసరం కోసం వచ్చారే కానీ కరోనా వైరస్ సమస్య లేకపోతే ఇప్పుడు కూడా వచ్చేవారు కాదేమో.

 

సిఎంతో భేటి తర్వాత చిరంజీవి మాట్లాడుతూ ఏడాదిగా కలుద్దామని అనుకుంటుంటే కుదరలేదని  చెప్పటమే విచిత్రంగా ఉంది. అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ ను అభినందించటానికి సినీప్రముఖులకు మనసు రాలేదు. పైగా చంద్రబాబునాయుడు ఓడిపోయినందుకు లోలోపల చాలామంది కుమిలిపోయుంటారన్న విషయంలో సందేహం లేదు. ఫీల్డులోని చాలామంది చంద్రబాబు కనుసన్నుల్లో నడుచుకునే వారు కాబట్టే జగన్ ను అభినందించటానికి ఇష్టపడలేదనే ప్రచారం ఎప్పటి నుండో వినిపిస్తోంది.

 

ఏడాది నుండి జగన్ ను కలుద్దామని అనుకున్నా కుదరలేదని చెబితే నమ్మేవాళ్ళెవరూ లేరు. సినీ ప్రముఖులు జగన్ ను కలుద్దామని అనుకుంటే అపాయిట్మెంట్ దొరకటం కష్టమే కాదు. ఏదో వ్యక్తిగత పనిమీద జగన్ తో చిరంజీవి భేటి అయిన విషయం తెలిసిందే. ఇక పోసాని కృష్ణమురళి, పృధ్విరాజ్, విజయచందర్ మొదటి నుండి జగన్ తో నే నడుస్తున్న విషయం తెలిసిందే.   వ్యక్తిగతంగా అవసరమైనపుడు మాత్రమే సిఎంను కలవటం వేరు పరిశ్రమలోని ప్రముఖులుగా వచ్చి అదే పనిగా  కలవటం వేరు.

 

జగన్ అధికారంలోకి రాగానే ప్రముఖులంతా కలిసి వచ్చుంటే వాళ్ళకే గౌరవంగా ఉండేది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సినీ ప్రముఖులు వచ్చి తనను కలవాలని జగన్ కూడా అనుకోలేదేమో. ఎందుకంటే వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడే వ్యక్తి కాదు కాబట్టే సినీ ప్రముఖులను జగన్ కూడా పట్టించుకోలేదు. ఎప్పటికైనా సినీ పరిశ్రమకే ప్రభుత్వంతో అవసరం ఉంటుందన్న విషయం సో కాల్డ్ ప్రముఖులు మరచిపోకూడదు. ఇటు ప్రభుత్వ పెద్దలు అటు సినీ ప్రముఖులు కలిసుంటేనే ఫీల్డయినా, ప్రాంతాలైనా డెవలప్ అవుతాయి. సరే ఇప్పటికైనా వచ్చి జగన్ను  కలిశారుగా చూద్దాం వైజాగ్ డెవలప్మెంట్ ఏ స్ధాయిలో జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: