
పంచాయితి ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశంపార్టీ మద్దతుదారులపై అనేక కాంట్రవర్సీలున్నాయి. మొదటి విడతలో జరిగిన పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు 38 శాతం పంచాయితీలను గెలుచుకున్నట్లు చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో 38 శాతం కాదని టీడీపీ మద్దతుదారులు గెలిచింది కేవలం 16 శాతమే అని మంత్రులు, వైసీపీ నేతలు లెక్కలు చూపిస్తున్నారు. సరే పార్టీ రహితంగా జరిగే పంచాయితి ఎన్నికల్లో ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. అయితే 38 శాతం పంచాయితీలను తమ మద్దతుదారులే గెలుచుకున్నారని చంద్రబాబు ఎందికింత సంబరపడిపోతున్నారు ? అన్నదే చాలామందికి అర్ధం కావటం లేదు.
ఇదే విషయమై పార్టీ నేతల మధ్య ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేమిటంటే పంచాయితి ఎన్నికల్లో నామినేషన్లు వేయటమే ఎన్నికల్లో గెలిచినట్లుగా చంద్రబాబు అనుకున్నారట. ఎందుకంటే అసలు పార్టీ తరపున మద్దతుదారులు ఎవరు కూడా పోటీ చేయటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇపుడు పోటీపడినా మరో మూడేళ్ళు అధికారంలోనే ఉండే వైసీపీ నేతలను కాదని తాము అడుగు కూడా కదపలేమని చోటా మోటా నేతలకు బాగా తెలుసు. ఇపుడు చంద్రబాబు మాటలతో రెచ్చిపోయి నామినేషన్లు వేసి పోటీకి తొడకొడితే చివరకు ఏమి అవుతుందో గ్రామ, మండల స్ధాయి నేతలకు బాగా తెలుసు. అందుకనే పోటీకి ఎవరూ ముందుకురాలేదు.
పైగా నామినేషన్ వేసి పోటీకి రెడీ అయితే ఖర్చులను ఎవరు పెట్టుకుంటారు ? ఇదే పెద్ద సమస్యగా మారింది. మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలు, మాజీ ఎంపిలు, మాజీ ఎంపిల్లో చాలామంది ఖర్చుల విషయంలో మొహం చాటేస్తున్నారట. అందుకనే చిరవకు నామినేషన్లు వేయటానికైనా నేతలు దొరుకుతారా అన్నదే పెద్ద ప్రిస్టేజ్ అయిపోయింది. ఇలాంటి నేపధ్యంలో చంద్రబాబు చెప్పినట్లు 38 శాతమైనా, వైసీపీ చెబుతున్నట్లు 16 శాతమైనా టీడీపీ మద్దతుదారులు గెలవటమే చాలా గొప్పయిపోయింది. ఇందుకనే చంద్రబాబు సంతోషాన్ని పట్టలేకపోతున్నారట. సరే ఇపుడు గెలిచినవారిలో ఎంతమంది చివరి వరకు టీడీపీలోనే కంటిన్యు అవుతారంటే అది వేరే సంగతి.