ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో టెక్నాలజీ భూతం మన కొలువుల వేటకు బయల్దేరింది. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది కీలక రంగాలు ఈ ఏఐ దెబ్బకు కుదేలవడం ఖాయమని అంతర్జాతీయ నివేదికలు హోరెత్తిస్తున్నాయి. ఇకపై మనుషుల అవసరం లేదంటూ, అనేక కంపెనీలు ఏఐ ఏజెంట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఐబిఎం వంటి టెక్ దిగ్గజాలు నియామకాల బాధ్యతను ఏఐ భుజస్కంధాలపై మోపడమే.

ఐబిఎం వేసిన అడుగు, మిగిలిన కార్పొరేట్ ప్రపంచానికి ఓ పెద్ద సిగ్నల్. ఇకపై హెచ్‌ఆర్ విభాగాల్లో మనుషుల ప్రమేయం తగ్గి, ఏఐ చక్రం తిప్పడం ఖాయం. అభ్యర్థుల ఎంపిక నుంచి ఆన్‌బోర్డింగ్ వరకు అన్నీ ఏఐ కనుసన్నల్లోనే నడవనున్నాయి. ఇక డ్రైవింగ్ పరిశ్రమ సంగతి సరేసరి. స్వయం చోదిత వాహనాలు రోడ్లపైకి దూసుకొచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు డ్రైవర్ల ఉద్యోగాలకు గ్యారెంటీ లేనట్టే. అది వ్యక్తిగత కార్ డ్రైవర్ అయినా, భారీ వాహనాల సారథి అయినా.. అందరి బతుకు చక్రాలు ఏఐ రాకతో పంక్చర్ కావడం ఖాయం.

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే కోడింగ్, కోడింగ్ అంటే సాఫ్ట్‌వేర్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్! గూగుల్ జెమినీ వంటి ఏఐ టూల్స్ రంగప్రవేశంతో, ఇక మనమే కోడింగ్ చేయాల్సిన పనిలేదు. మన ఆలోచన చెబితే చాలు, అద్భుతమైన కోడ్‌ను ఏఐ క్షణాల్లో రాసిపడేస్తుంది. ప్రాథమిక స్థాయి కోడింగ్ నుంచి క్లిష్టమైన అప్లికేషన్ల అభివృద్ధి వరకు ఏఐ తన విశ్వరూపం చూపించనుంది. దీంతో, ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే యువతకు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.

మీ వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ గార్డుగా ఏఐ అవతారమెత్తనుంది. సైబర్ నేరగాళ్ల ఎత్తులను చిత్తు చేస్తూ, మన ఆన్‌లైన్ జీవితానికి రక్షణ కవచంలా నిలవనుంది. మరోవైపు, ఈమెయిళ్లు చెక్ చేయడం, రిపోర్టులు తయారుచేయడం, అపాయింట్‌మెంట్లు షెడ్యూల్ చేయడం వంటి పనులన్నీ ఏఐయే చక్కబెట్టేస్తే, పర్సనల్ అసిస్టెంట్లు, కార్యదర్శుల అవసరం ఏముంటుంది? వారి పాత్రలు కుదించుకుపోవడం తథ్యం. 

ఆన్‌లైన్లో మెసేజ్‌లకు సమాధానమివ్వడం నుంచి, కస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడం వరకు ఏఐ అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకోనుంది. దీంతో సేల్స్ విభాగంలో ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డట్టే. ఈ-కామర్స్ వ్యాపారాలు ఇప్పటికే ఉత్పత్తి జాబితాలు, కస్టమర్ కమ్యూనికేషన్ కోసం ఏఐ టూల్స్‌ను వాడేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

ఇక రాబోయే ఐదేళ్లలో రెస్టారెంట్ పరిశ్రమలోనూ ఏఐ పెను మార్పులు తీసుకురానుంది. ఆర్డర్లు తీసుకోవడం, బిల్లులు వేయడం, వంటకాలు వడ్డించడం వంటి పనులన్నీ రోబోలే చేసేస్తాయి. ఇప్పటికే కోల్‌కతా, లండన్ వంటి నగరాల్లో రోబోలు ఆహారాన్ని అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చివరికి, సోషల్ మీడియాలో బ్రాండింగ్, కంటెంట్ మేనేజ్‌మెంట్ వంటి సృజనాత్మక రంగాల్లోకి కూడా ఏఐ చొచ్చుకుపోయింది. ఏఐ టెక్నాలజీ మరింత విస్తృతం అవుతున్న కొద్దీ, ఈ రంగాల్లోని ఉద్యోగాలకు కూడా ఎసరు తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: