
ప్రత్యేకంగా భారతీయ సంస్కృతిలో కలలు కేవలం ఊహలు కాదని, అవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలపై ఒక హెచ్చరిక లేదా సూచన అని నమ్మకం. చనిపోయిన వారిని కలలో చూడటం అంటే వారు మనతో ఏదో చెప్పడానికి, మన జీవితంలో ఏదో మార్పు జరగబోతుందని తెలియజేయడానికి వస్తారని పెద్దలు చెబుతారు. కలల్లో చనిపోయిన వాళ్లు కనిపించడం వెనుక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది.
ఆత్మల సందేశం: అనేక ఆధ్యాత్మిక పండితుల అభిప్రాయం ప్రకారం, ఆత్మలు శరీరాన్ని వదిలినా, తమ ప్రియమైన వారిని చూడాలని, వారిని రక్షించాలని అనుకుంటాయని చెబుతారు. అలాంటి సందర్భాల్లో వారు కలల రూపంలో మనకు ప్రత్యక్షమవుతారని విశ్వాసం.
సాంత్వన కోసం వస్తారు: కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు లేదా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మన పూర్వీకులు కలలో ప్రత్యక్షమై మనకు ధైర్యం చెబుతారని భావిస్తారు.
హెచ్చరికలు, సూచనలు: పాత పుస్తకాల ప్రకారం, చనిపోయిన వారు కలలో వస్తే జీవితంలో ఏదో మార్పు జరగబోతుందనే సంకేతం అని నమ్మకం. ఆ మార్పు మంచిది కూడా కావచ్చు, కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండవచ్చు.
సైంటిఫిక్ దృష్టిలో వివరణ:
సైకాలజీ ప్రకారం, మనం ఎవరినైనా చాలా మిస్ అవుతున్నప్పుడు, వారి గురించి నిరంతరం ఆలోచిస్తున్నప్పుడు, మన అవచేతన మనస్సులో ఆ వ్యక్తి రూపం స్థిరంగా నిలుస్తుంది. నిద్రలో ఆ ఆలోచనలు కలల రూపంలో మనకు కనిపిస్తాయి. ఇది మన మనస్సు తీరును ప్రతిబింబిస్తుంది కానీ వాస్తవంలో జరుగుతున్న సంకేతం కాకపోవచ్చు.
కలల్లో చనిపోయిన వాళ్లు కనిపిస్తే సాధారణ అర్థాలు:
*సాంత్వన అవసరం ఉన్నప్పుడు – మనం ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు, మనసుకు బలం కావాలనుకున్నప్పుడు ఈ రకమైన కలలు వస్తాయి.
*భవిష్యత్తులో మార్పులు జరగబోతున్నప్పుడు – కుటుంబంలో లేదా ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో మార్పులు జరగబోతున్న సంకేతంగా పరిగణిస్తారు.
*సంబంధ బంధాలు బలంగా ఉన్నాయని సూచన – చనిపోయిన వారు మన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన పాత్ర పోషించారని ఈ కలలు గుర్తు చేస్తాయి.
*పూర్వీకుల ఆశీర్వాదం – అనేక మంది ఈ కలలను పాజిటివ్‌గా తీసుకుని దానిని పూర్వీకుల ఆశీర్వాదంగా పరిగణిస్తారు.
*ఈ కలలు వస్తే గుడికి వెళ్లి పూజలు చేయడం, పూర్వీకులకు తర్పణం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు.ఆత్మలకు శాంతి కలగాలన్న ఉద్దేశంతో సత్కార్యాలు చేయడం, అన్నదానం చేయడం వంటి పనులు చేస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.
మొత్తానికి, చనిపోయిన వారిని కలలో చూడటం వెనుక ఉన్న అర్థం మన మనసు స్థితి, మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కలలు కొందరికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తే, మరికొందరికి మానసిక సాంత్వనను ఇస్తాయి. అయితే అవి మనసును కలవరపెట్టే విధంగా ఉంటే, పాజిటివ్‌గా ఆలోచించడం, ధ్యానం, ప్రార్థన, సత్కార్యాలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.