
తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన మిరాయ్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలకు ముందే, 'వైబ్ ఉంది పిల్లా వైబ్ ఉందిలే' అనే పాట యూట్యూబ్‌లో పెద్ద హిట్ అయింది. పాటలో తేజ సజ్జా స్టైల్, డ్యాన్స్, అలాగే మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో, ఈ పాట సినిమాకి ఒక పెద్ద ప్లస్ అవుతుందని అందరూ భావించారు.
అయితే, సినిమా థియేటర్లలోకి వచ్చాక, ప్రేక్షకులు ఈ పాట కోసం ఎదురు చూశారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది. సినిమా ఫస్టాఫ్‌లో ఉండాల్సిన ఈ హిట్ సాంగ్‌ని మేకర్స్ కట్ చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద హిట్ అయిన పాటను సినిమాలోంచి తీసేయడం మేకర్స్ చేసిన పెద్ద తప్పు అని కామెంట్లు పెడుతున్నారు.
సాధారణంగా, ఒక పాట విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే, అది సినిమాకి ప్రమోషనల్ టూల్‌గా ఉపయోగపడుతుంది. 'మిరాయ్' విషయంలో 'వైబ్ ఉంది పిల్లా' పాట అదే పనిచేసింది. కానీ, ఆ పాట సినిమాలో లేకపోవడం వల్ల ఆడియన్స్ ఫీల్ అయ్యారు. 'ఈ సాంగ్ ఉండుంటే సినిమా ఫస్టాఫ్ ఇంకా బాగుండేది' అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. అయితే, ఈ పాటను సినిమా నుంచి ఎందుకు తొలగించారనేది మిస్టరీగా మిగిలిపోయింది.
ఈ సాంగ్ ను యాడ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సాంగ్ ను యాడ్ చేస్తారేమో చూడాల్సి ఉంది. మిరాయ్ సినిమా కమర్షియల్ రేంజ్ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేనట్టేనని చెప్పవచ్చు. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.