ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పాదయాత్ర మొదలైంది. అమరావతి రైతుల ఉద్యమానికి ఇవాళ్టితో 1000 రోజులు పూర్తవుతాయి. ఈ వెయ్యి రోజుల ఉద్యమం సందర్భంగా ఇవాళ్టి నుంచి అమరావతి రైతులు మహా పాదయాత్ర 2.0 ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకూ ఈసారి  పాదయాత్ర సాగనుంది. గతంలో ఇదే రైతులు అమరావతి నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకట పాలెం తితిదే ఆలయంలో రైతుల పూజలు చేసి ఉదయం 6గంటల 3 నిమిషాలకు పాదయాత్ర లాంఛనంగా పాదయాత్ర ప్రారంభించారు.


ఈసారి 900 కిలోమీటర్లకు పైగా సాగనున్న ఈ అరసవల్లి మహా పాదయాత్ర సాగనుంది.  60 రోజుల పాటు జరిగేలా పాదయాత్రకు రూప కల్పన చేశారు. గుంటూరు జిల్లాలో 9 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ రెండో విడత పాదయాత్ర.. 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. మొదటి రోజు వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వరకు రైతుల పాదయాత్ర సాగుతుంది. ఇవాళ రాత్రికి మంగళగిరిలో రైతులు బస చేస్తారు.


రైతుల పాదయాత్రకు అనేక రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. బీజేపీ నుంచి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పాదయాత్ర ప్రారంభానికి హాజరవుతున్నారు. కాంగ్రెస్ నుంచి తులసీరెడ్డి,  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరవుతున్నారు. జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వర రావు హాజరవుతున్నారు.


ఈ రైతుల పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటున్నారు. టీడీపీ నుంచి ఆయనతో పాటు తొలిరోజు తెనాలి శ్రావణ్ కుమార్, దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె అనురాధ పాదయాత్రలో పాల్గొంటారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో మరోసారి ఏపీ రాజధాని అమరావతి అంశం జనంలో చర్చకు వస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. అయితే.. జనం మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: