శాసన మండలి.. ఏపీ సీఎం జగన్‌కు పెద్దగా నచ్చని మాటల్లో ఇదొకటి. ఎందుకంటే.. తాను సీఎం కాగానే చేయాలనుకున్న కొన్ని పనులకు ఇదే శాసన మండలి అడ్డుపడింది. ఎందుకంటే.. ఈ శాసన మండలిలో ఆధిక్యం తెలుగు దేశం పార్టీకే ఉండేది. అందులో మండలి చైర్మన్ టీడీపీ వ్యక్తే. మండలిలో మెజారిటీ సభ్యులు తెలుగుదేశం వారే.. అసెంబ్లీలో కీలకమైన చట్టం పాస్ కావాలన్నా మండలి అనుమతి ఉండాల్సిందే. మరి అక్కడేమో టీడీపీ పాగా వేసుకుని కూర్చింది. అందువల్ల జగన్‌ అధికారాలకు ఈ శాసన మండలి కత్తెర వేస్తుండేది.

జగన్ మూడు రాజధానుల బిల్లును కూడా ఇలాగే శాసన మండలి అడ్డుకుంది. దాంతో.. తిక్కరేగిన జగన్ అసలు శాసన మండలినే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది అమల్లోకి రాలేదనుకోండి. కానీ.. కాలక్రమేణా ఇదే శాసన మండలిలో వైసీపీ బలం పెరుగుతోంది. ఇంకొన్నాళ్లుంటే.. శాసన మండలిలో వైసీపీయే మెజారిటీ అవుతుంది. అందుకే త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం. అవి పూర్తయితే శాసన మండలిలో వైసీపీదే పెత్తనం సాగబోతోంది.  

అయితే ఇప్పుడు అనూహ్యంగా  ఈసీ జగన్ సర్కారు షాక్ ఇచ్చింది. కరోనా ఉధృతి కారణంగా  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసేసింది. దీంతో వైసీపీ ఆధిపత్యానికి అవకాశం కల్పించే ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. దీని కారణంగా మరికొన్నాళ్లు టీడీపీ ఆధిపత్యమే శాసన మండలిలో కొనసాగనుంది. టీడీపీకి చెందిన ప్రస్తుత మండలి ఛైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ పదవీకాలం మే 24తో ముగుస్తోంది. జూన్ 18 నాటికి మొత్తం మండలిలో ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

వీటికి ఎన్నికలు జరిగితే.. ఆటోమేటిగ్గా అన్నీ వైసీపీకే వస్తాయి.  అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం  కారణంగా అన్నీ వైసీపీ ఖాతాలోకే వస్తాయి. అప్పుడు శాసన మండలిలోనూ మెజార్టీ సీట్లతో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించేది. అంతే కాదు.. మండలి చైర్మన్ పదవిని దక్కించుకునేది. కానీ ఈ కరోనా కారణంగా ఆ అవకాశం మరికొంత కాలం వాయిదా పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: