కరోనా అందరినీ దెబ్బ కొట్టింది. సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలా అన్ని సినిమాలపై కరోనా ప్రభావం పడినా.. అందరూ ట్రిపుల్ ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మరోసారి వాయిదా పడ్డ ఈ సినిమా.. 2021 జనవరి 8న అయినా వస్తుందా.. రాదా.. ఒకవేళ మరోసారి పోస్ట్ పోన్ అయితే.. రిలీజ్ ఎప్పుడు.. ఇలా ఎన్నో ప్రశ్నలు అందరినీ ఊరిస్తున్నాయి. 


ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగిస్తే.. నెలాఖరు నుంచి షూటింగ్ స్టార్ట్ చేయొచ్చన్న ప్లాన్ లో ట్రిపుల్ ఆర్ టీం ఉంది. అయితే.. మే 3వరకు లాక్ డౌన్ పొడిగించడంతో కథ అడ్డం తిరిగింది. షూటింగ్ కు మరోసారి అడ్డంకి తప్పలేదు. మే లోగా కరోనా కట్టడి అయితేనే.. లేదంటే.. లాక్ డౌన్ పొడిగించినా పొడిగించొచ్చు. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడిపోయింది. 

 

రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాల కారణంగా.. షూటింగ్ లేటవడంతో జులైలో రావాల్సిన ట్రిపుల్ ఆర్ ను 2021 జనవరి 8న వస్తుందని ప్రకటించారు. దీని ప్రకారం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడు దర్శకుడు. ఏప్రిల్ లో అలియాభట్ సెట్స్ లోకి అడుగుపెట్టేలా.. 10రోజుల్లో ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్న ప్లాన్ కరోనా కారణంగా బెడిసికొట్టింది. హిందీలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఆలియా నుంచి డేట్స్ తీసుకోవడం ఇబ్బందికర విషయమే. అలాగే.. అజయ్ దేవగణ్ పై చిత్రీకరించాల్సిన సీన్స్ ఇంకా ఉన్నాయి. 

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తప్ప మరో సినిమా చేయకపోవడంతో.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డేట్స్ ఇస్తారు. ఈ ఇద్దరిలో ప్రాబ్లమ్ లేదు కానీ.. బాలీవుడ్ నటులు ఆలియా.. అజయ్ దేవగమ్ డేట్స్ కుదరాలి. వీళ్లపై షూటింగ్ పూర్తి చేస్తే గానీ.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: