తెలుగు తెర 70ఎమ్‌ఎమ్‌ కన్నా విశాలమైనది. తనను అలరించిన నటుణ్ని వెండితెర బంగారంలా చూసుకుంటుంది. అనామకులను స్టార్లను చేసింది. సూపర్‌ విలన్‌ను మెగాస్టార్‌గా నిలబెట్టింది.వారసులకూ పట్టం కట్టింది. సెల్యులాయిడ్‌ స్క్రీన్‌కు కితకితలు పెట్టించిన కమెడియన్లనూ హీరోలు చేసిన ఘనత టాలీవుడ్‌ సొంతం. ఈ ఒరవడి పాతదే అయినా.. ఈ తరంలో మాత్రం నవ్వులు పంచుతున్న ఎందరో నటులు.. హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమ అదృష్టాన్ని నవ్వులతోనే పరీక్షించుకుంటున్నారు.

 

కమెడియన్లు హీరోలుగా ప్రయత్నించడం తెలుగు సినిమా చరిత్రలో పాతదే! బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో ఒకరిద్దరు మాత్రమే ఇలా హీరోలుగా సాహసం చేశారు. రెండో తరంలోనూ అదే ఒరవడి కొనసాగినా.. సినిమాల సంఖ్య విశేషంగా పెరిగింది. ప్రస్తుతం నలుగురైదుగురు కమెడియన్లు హీరోలుగా చేస్తూ మంచి హిట్లు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కమర్షియల్‌ ఫార్ములా కాకుండా.. విభిన్న కథలను ఎంచుకొని తమ కామెడీ టైమింగ్‌తో సినిమాకు హీరో టచ్‌ ఇస్తున్నారు.టాలీవుడ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ జమానాను ఏలిన కమెడియన్లలో పద్మనాభం ఒకరు. రేలంగి తర్వాత అంతటి ఘనుడన్న కీర్తి సంపాదించాడు. కమెడియన్‌ పాత్రలు వేసినా చాలా సినిమాల్లో పద్మనాభానికి ఒక పాట పెట్టేవారు దర్శక, నిర్మాతలు. అలా హీరోకున్నంత స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. ఆయనే స్వయంగా రేఖ అండ్‌ మురళి సంస్థను స్థాపించి హీరోగా అవతారం ఎత్తాడు. మొదటి ప్రయత్నంగా 'పొట్టి ప్లీడరు' సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు. కోర్టు డ్రామా కథతో ప్రేక్షకులను అలరించాడు. మరో ప్రయత్నంగా 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' సినిమాతో ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ దగ్గర మంచి హిట్‌ సాధించాయి. ఈ చిత్రంలోని పాటలూ బహుళ జనాదరణ పొందాయి. పొట్టివాడే కానీ గట్టివాడు అనిపించుకున్నాడు. హీరోగా అవతారమెత్తిన మొదటి తెలుగు కమెడియన్‌గా పద్మనాభం పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.'అహ నా పెళ్ళంట!'తో కమెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయమైన నటుడు బ్రహ్మానందం. మొదటి సినిమాలో 'అరగుండు'గా అలరించిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నాడు. హీరో ఎవరున్నా.. కమెడియన్‌ బ్రహ్మానందం ఓన్లీ అన్నంతగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగానూ బ్రహ్మి మంచి ప్రయత్నాలే చేశాడు. 'బాబాయి హోటల్‌’, 'పెళ్లామా మజాకా!', 'జోకర్‌ మామ సూపర్‌ అల్లుడు' తదితర సినిమాలు బ్రహ్మానందానికి హీరోగా మంచిపేరే తెచ్చాయి. అయితే, కొన్ని సినిమాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్‌ కాకపోవడంతో ఈ కామెడీ కింగ్‌ మళ్లీ నవ్వుల జర్నీ కంటిన్యూ చేశాడు.
బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ కమెడియన్‌గా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించాడు. హీరో పాత్రలకు స్నేహితుడిగా అలీ పండించిన కామెడీ ఎప్పటికీ గుర్తుంటుంది. కమెడియన్‌గా పీక్‌లో ఉన్నప్పుడే 'యమలీల' సినిమాతో హీరోగా ప్రయత్నించాడు. ఆ చిత్రం మెగాహిట్‌ అవ్వడంతో బిజీ అయిపోయాడు. దాదాపు యాభై సినిమాల వరకు హీరోగా చేసి ప్రేక్షకులను అలరించాడు. ఘటోత్కచుడు, పిట్టలదొర, ఆలీబాబా అద్భుత దీపం, అక్కుం బక్కుం ఇలా ఏడాదికి రెండు మూడు చిత్రాల్లో హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు.అలీ తర్వాత చాలాకాలం హీరోగా మరే కమెడియన్‌ ప్రయత్నించలేదు. కొరియోగ్రాఫర్‌ అవుదామని వచ్చి కమెడియన్‌గా స్థిరపడ్డ సునీల్‌ దీన్ని బ్రేక్‌ చేశాడు. 2006లో 'అందాల రాముడు' సినిమాతో హీరోగా ప్రయోగం చేశాడు. ఆ చిత్రం ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టినా.. కమెడియన్‌గానే కంటిన్యూ అయ్యాడు. 2010లో రాజమౌళి దర్శకత్వంలో 'మర్యాదరామన్న' సినిమాతో పూర్తిస్థాయి కథానాయకుడిగా మారాడు. తర్వాత కమెడియన్‌ పాత్రలు తగ్గిస్తూ వచ్చాడు. ఒకానొక దశలో కేవలం హీరో పాత్రలకే పరిమితం అయ్యాడు. పూలరంగడు, మిస్టర్‌ పెళ్లికొడుకు, తడాఖా, కృష్ణాష్టమి, ఈడు గోల్డ్‌ ఎహే… ఇలా వరుసగా సినిమాలు చేశాడు. అయితే చాలా చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో హీరోగా సునీల్‌ క్రేజ్‌ తగ్గిపోయింది. కొన్నాళ్లకు తనకు అచ్చొచ్చిన కామెడీనే ఎంచుకొని మళ్లీ ఆ దారిలోకి వచ్చాడు. 'పుష్ప'తో విలన్‌గా సత్తా చాటాడు. ఇప్పుడు కమెడియన్‌గా, విలన్‌గా రాణిస్తూ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాడు ఈ భీమవరం బుల్లోడు.కమెడియన్లలో వేణుమాధవ్‌ ైస్టెల్‌ ప్రత్యేకం. మిమిక్రీపై పట్టున్న ఈ నవ్వుల నటుడి కెరీర్‌ జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోయింది. కమెడియన్‌గా పీక్‌లో ఉన్నప్పుడు హీరోగానూ ప్రయత్నం చేశాడు. హంగామా, భూకైలాస్‌, ప్రేమాభిషేకం సినిమాల్లో కథానాయకుడి పాత్ర పోషించాడు. హీరోగా నటిస్తూనే.. వేరే సినిమాల్లో కామెడీ రోల్స్‌ చేస్తూ కెరీర్‌ ఇబ్బందిపడకుండా జాగ్రత్తపడ్డాడు. కమర్షియల్‌ ఈక్వేషన్స్‌కు తాను సరిపడనని భావించి హీరోయిజం నుంచి జెట్‌స్పీడ్‌లో వెనక్కి వచ్చి బతికున్నంత కాలం కమెడియన్‌గా కంటిన్యూ చేశాడు.కమెడియన్‌గా బ్రహ్మానందం, అలీ అంత క్రేజ్‌ లేకున్నా.. శ్రీనివాస్‌ రెడ్డిది డిఫరెంట్‌ అప్పియరెన్స్‌! టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యంగ్‌ హీరోలకు స్నేహితుడి పాత్రలో ఎన్నో సినిమాల్లో అలరించాడు. కమెడియన్‌గా అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్న తరుణంలోనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 'గీతాంజలి'తో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత హారర్‌ కామెడీ సినిమా 'ఆనందోబ్రహ్మ'తో ద్వితీయ విఘ్నాన్నీ అధిగమించాడు. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో ఓ మోస్తరు సక్సెస్‌ సాధించాడు. కామెడీ పాత్రలు పోషిస్తూనే.. హీరోగా అవకాశం వస్తే వదలనంటున్నాడు శ్రీనివాస్‌ రెడ్డి.లుక్స్‌, స్మైల్‌తో కామెడీ పుట్టించగల నటుడు సుహాస్‌. కమెడియన్‌గా లాంగ్‌ జర్నీ పూర్తికాకముందే హీరోగా ప్రయత్నించి వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. మొదటి ప్రయత్నంగా ఆయన హీరోగా నటించిన 'కలర్‌ఫొటో' సినిమా ఆహా ఓటీటీలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. 'రైటర్‌ పద్మభూషణ్‌’లో సుహాస్‌ పెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. కామెడీతోపాటు ఎమోషన్స్‌ కూడా బాగా పండించి మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలోనూ తన యాక్టింగ్‌ పవర్‌ చూపించాడు. ఈ సినిమా కూడా మంచి టాక్‌ తెచ్చుకోవడంతో ఇప్పుడు హీరోగా సెటిల్‌ కావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా సుహాస్‌ హీరోగా 'ఆనందరావు అడ్వెంచర్స్‌’ అనే ఫాంటసీ సినిమా తెరకెక్కుతుండటం విశేషం.ఎంత సీరియస్‌ సినిమాలో అయినా సరే.. వెన్నెల కిషోర్‌ పాత్ర రాగానే, థియేటర్‌లో నవ్వులు పూస్తాయి. డిఫరెంట్‌ మేనరిజమ్స్‌, క్యారెక్టరైజేషన్స్‌తో ఈ కమెడియన్‌ చాలా సినిమాల సక్సెస్‌కు కారణమయ్యాడు. 2013లో 'అతడు ఆమె ఓ స్కూటర్‌’ సినిమాతో హీరోగా ప్రయత్నించిన కిషోర్‌.. 'ఎలుకా మజాకా' సినిమాలో బ్రహ్మానందంతో హీరోపాత్ర పంచుకున్నాడు. తాజాగా 'చారి 111'తో హీరోగా ప్రయత్నించాడు. ఇకపై ఈ నవ్వుల కిషోర్‌ ఎటుగా ప్రయాణిస్తాడో చూడాలి. 'సత్యం' సినిమాను ఇంటిపేరుగా మార్చుకున్న కమెడియన్‌ రాజేశ్‌. చాలాకాలం నవ్వులు పండించిన ఈ నటుడు ఇటీవల హీరోగా ప్రయత్నించాడు. 'పొలిమేర' సినిమాతో ఒక్కసారిగా తనలోని మరో కోణాన్ని చూపించాడు. 'పొలిమేర'తో ఓటీటీలో షాక్‌ ఇచ్చిన రాజేశ్‌.. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'పొలిమేర 2'తో బాక్సాఫీస్‌ దగ్గరా భారీ విజయాన్ని అందుకున్నాడు. జబర్దస్త్‌ కమెడియన్లు సుడిగాలి సుధీర్‌, షకలక శంకర్‌, ధన్‌రాజ్‌ సైతం హీరోలుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: