పెళ్లి అంటే చాలామంది సరదాగా.. “పెళ్లి చేసుకుని తప్పు చేశాం బాబూ” అంటుంటారు. ఇంకో కేటగిరీ వాళ్లు, అంటే పెళ్లి కానివాళ్లని అడిగితే.. పెళ్లి అంటేనే దారుణంగా మాట్లాడేస్తారు. కానీ పెళ్లి అనే బంధం విలువ ఎవరికి బాగా తెలుస్తుందంటే .. దాన్ని కోల్పోయిన వాడికే. ఇదే విషయాన్ని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తన జీవితాన్నే ఉదాహరణగా తీసుకుని చెప్పేశారు. “నేను చిన్నప్పటినుంచే సింపుల్‌గా ఉండటం ఇష్టపడ్డా. సంపాదించకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, కారు కొనకూడదు, ఆస్తులు కూడగట్టకూడదు అనే ఆలోచన నాలో బలంగా ఉంది. అందుకే నేను ఇల్లు కట్టుకోలేదు. కారు కూడా కొనలేదు.
 

ఇక చాలా మంది నాకు ఇల్లు, కారు ఆఫర్ చేశారు. కానీ నేను తిరస్కరించాను. అవి నాకు అవసరం లేవు అనుకున్నా” అంటూ మొదలు పెట్టిన ఆయన, తన గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయటపెట్టారు. “పెళ్లి కూడా చేసుకోలేదు .. ఇల్లు కూడా లేదు .. కారు కూడా లేదు. ఇలాంటివి లేకుండా నేను నా లైఫ్‌ని నెట్టుకుపోతున్నా. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఒకసారి గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచించా. నాకు తోడు ఉంటే బాగుండేది. అప్పుడు రెండు పక్షులు గూటికి వెళ్లడాన్ని చూశా. అప్పుడు గ్రహించా – ప్రతి జీవరాశికి కూడు, గూడు, నీడ అవసరం. నేనొక మనిషినై ఉండి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని పశ్చాత్తాపపడ్డా” అని నిజాయితీగా అంగీకరించారు. తన అనుభవం ద్వారా కొత్త జనరేషన్‌కి పీపుల్స్ స్టార్ క్లారిటీ ఇచ్చేశారు – “ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.


పెళ్లి వయసు వచ్చిందంటే వెంటనే పెళ్లి చేసుకోండి. కుటుంబ నియంత్రణ వంటివి వద్దు.. హ్యాపీగా పిల్లల్ని కనండి. ఇల్లు కట్టుకోండి .. కార్లు కొనండి .. సూట్ బూట్ వేసుకుని దర్జాగా ఉండండి. నేను సింపుల్‌గా ఉన్నానని అనేది ఫూల్‌స్ ఐడియా. నా జీవితం మీకు మార్గదర్శకం కాదు. నాలా ఎవరూ ఉండకండి. నేను ఇప్పుడే ఫీల్ అవుతున్నా. మీరు అలా కాకూడదు” అని హృదయపూర్వకంగా పిలుపునిచ్చారు. ముగింపులో నారాయణమూర్తి ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు – “నిజాయితీగా సంపాదించండి.. నిజాయితీగా బ్రతకండి.. పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి.. ఎంజాయ్ చేయండి. నా లాంటి పరిస్థితి మీకు రాకూడదు.” మాస్ పంచ్ ఏంటంటే – “పెళ్లి చేసుకుని ఫీల్ అవ్వొచ్చు కానీ.. పెళ్లి చేసుకోకపోతే లైఫ్ అంతా పశ్చాత్తాపమే”

మరింత సమాచారం తెలుసుకోండి: