త్వరలోనే అనుష్క శెట్టి దగ్గర నుంచి గుడ్ న్యూస్ రాబోతోందా..? అంటే  "అవును" అన్న సమాధానమే వినిపిస్తుంది. అయితే అది పెళ్లి గురించి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అనుష్క దగ్గర నుంచి గుడ్ న్యూస్ అంటే ప్రజలు కచ్చితంగా పెళ్లి గురించే అనుకుంటూ ఉంటారు. ఆమె పెళ్లి కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అనుష్క-ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ దానికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటనను ఈ ఇద్దరూ చేయలేదు. అంతేకాదు "మా మధ్య అలాంటి సంబంధం లేదు, మేము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే" అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఇక అనుష్క తాజాగా నటించిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆమె "శీలావతి" అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే అనుష్క మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. ఫోన్ కాల్ ఇంటర్వ్యూల ద్వారానే పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రానా దగ్గుబాటితో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో ఘాటి సినిమా విశేషాలను పంచుకున్నారు. అలాగే కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిపారు. బాహుబలి, అరుంధతి సినిమాల తర్వాత ఘాటి కూడా తనకు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. సినిమాలో ఉన్న హింసను పక్కన పెడితే, కథ ప్రస్తుత సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. "క్రిష్ ఎప్పుడూ నాకు మంచి పాత్రలే ఇస్తారు. వేదం సినిమాలో సరోజ పాత్ర ఎంత హైలైట్ అయిందో, ఈ సినిమాలో శీలావతి పాత్ర కూడా అంతే హైలైట్ అవుతుంది. ఇది నాకు ప్రత్యేక గుర్తింపును తెస్తుంది" అని చెప్పారు.

ఇక రానా మాట్లాడుతూ... "ఇకపై ఇలాగే మూడు ఏళ్లకు ఒక సినిమా చేస్తావా? నిన్ను చూసి దాదాపు 10 ఏళ్లు అవుతోంది" అని ప్రశ్నించగా, అనుష్క నవ్వుతూ, "కచ్చితంగా మంచి స్క్రిప్టులు వస్తే వరుసగా సినిమాలు చేస్తాను. అలాగే మీ అందరి ముందుకు కూడా వస్తాను. మా ఇళ్లలో జరిగే పెళ్ళి వేడుకలకు కూడా నేను వెళ్లడం లేదు. అందరూ 'ఎప్పుడు వస్తావు?' అని అడుగుతున్నారు. త్వరలోనే మీ అందరి ముందుకు వస్తాను. కచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను" అని సమాధానమిచ్చారు.ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు "పెళ్లి గుడ్ న్యూస్ కూడా చెబితే బాగుంటుంది" అని కామెంట్లు చేస్తున్నారు. చూద్దాం మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో!



మరింత సమాచారం తెలుసుకోండి: