'శివ' స్క్రిప్ట్ రాసేందుకు వర్మ భరణి గారిని కోరినప్పుడు, భరణి గారు దాన్ని కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా భావించి సహజంగా కామెడీ డోస్ పెంచారట. రాసిచ్చిన పేపర్లు అప్పటి అసిస్టెంట్ కృష్ణవంశీని సైతం నవ్వించాయట. కానీ, వర్మ ఆ స్క్రిప్ట్ విన్నాక ఇచ్చిన కౌంటర్ షాకింగ్. "సినిమాలో ఒక్క జోక్ కూడా ఉండటానికి వీల్లేదు!" – ఇది ఆర్జీవీ ఇచ్చిన కరాఖండీ ఆదేశం. ఆ మాట వినగానే, 'ఈ సినిమా ఆడదు' అని భరణి మనసులో అనుకుని, కథను మార్చేశారట! అంతేకాదు, కెమెరామెన్ ఎస్. గోపాల్ రెడ్డి సహా యూనిట్ మొత్తానికి వర్మపై ఏ మాత్రం నమ్మకం కలగలేదు. కానీ.. ఆ పవర్ ఫుల్ విజన్‌ను గుడ్డిగా నమ్మింది ఒక్కడే. అతడే కింగ్ నాగార్జున!
మార్పులు చేసిన స్క్రిప్ట్‌ను వర్మకు స్వయంగా అందించేందుకు భరణి గారికి కుదరక, దాన్ని తన మిత్రుడు సీవీఎల్ నరసింహారావు ద్వారా పంపించారు. ఆ తర్వాత వర్మ నుంచి కాల్ లేదు, సినిమా ప్రకటనలో భరణి పేరు లేదు! దీంతో తీవ్ర నిరాశకు గురైన భరణికి, తర్వాత కో-డైరెక్టర్ కాల్ చేసి వర్మ అలక గురించి చెప్పారు. స్వయంగా వర్మను కలిసినప్పుడు అసలు నిప్పు రాజుకుంది. "భరణీ! ఏ సినిమాకైనా స్క్రిప్ట్ అనేది గాడ్ (దేవుడు).. దాన్ని ఇంకొకరి చేతికి ఇచ్చి పంపుతావా? ఇది నీ మొదటి తప్పు!" అంటూ వర్మ క్లాస్ పీకారు. అప్పుడు భరణి గారు ధైర్యంగా వేసిన మాస్ ప్రశ్న.. "అసలు మన సినిమాలో కథ ఉందా?" ఈ ఒక్క మాటతో వర్మ నవ్వేశారంటే, 'శివ' ఎంత కథ-రహితమైన విప్లవాత్మక చిత్రమో అర్థమవుతుంది.
కోపం, ప్రేమ, అలక, అనుబంధం... వీటితో వర్మకు సంబంధం లేదు. అతను ఒక ప్రయోగశాల. మనుషులను, సంఘటనలను పెద్దగా గుర్తుంచుకోడు. అందుకే "స్క్రిప్ట్ అనేది గాడ్" అని నమ్మిన వర్మ, ఆ దేవుడిని తక్కువ చేసినందుకు భరణిని పక్కన పెట్టారు. ఇది కేవలం ఒక సినిమా మేకింగ్ కథ కాదు. అపారమైన విజన్, పట్టుదలతో ఒక దర్శకుడు, ఒక హీరో కలిసి తెలుగు సినిమాను రెండు ముక్కలు చేసి... ఒక యుగాన్ని ఎలా సృష్టించారో చెప్పే చరిత్ర! 'శివ' మళ్ళీ వస్తోంది... ఈసారి పాత చరిత్రను 4K పవర్‌తో తిరగరాయడానికి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి