వైద్యుడు భగవంతుడితో సమానం అంటారు.. ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లను ప్రజలు కొలుస్తుంటారు. తమ ప్రాణాలు కాపాడిన వైద్యులను గుండెళ్లో పెట్టుకుంటారు.  కాని కొందరు వైద్యులు మాత్రం కాసుల కోసం పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన వారే... యముళ్లుగా మారిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది. వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి పాప బలైంది. హాస్పిటల్‌ బిల్లులు పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో సర్జరీ తర్వాత కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు హాస్పిటల్ సిబ్బంది. దీంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది.

ఇంతటి అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో ఆలస్యంగా  వెలుగు చూసింది. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్‌ టౌన్‌కు చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి రావటంతో ప్రయాగ్‌ రాజ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్‌ చేశారు. అయితే హాస్పిటల్‌ బిల్లులు మొత్తం కట్టలేదన్న కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపును కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో పాప మరణించింది.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఓ వ్యక్తి తన ఖాతాలో షేర్‌ చేయటంతో సంఘటన వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన స్థానిక వైద్యాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. హాస్పిటల్ బిల్లు కట్టలేదని.. సర్జరీ చేసి కుట్లు వేయకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ హాస్పిటల్ ను సీజ్ చేయడంతో పాటు కుట్ల వేయకుండా వెళ్లిన డాక్టర్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ, మళ్లీ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: