లాక్ డౌన్ తో చిన్నతరహా పరిశ్రమ కుదేలైంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పట్లో కోలుకుంటాయా..? అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే అనుమానంగానే ఉంది. ముప్పై రోజులుగా ఎటువంటి వ్యాపార కార్యకలపాలు లేకపోవడంతో ఆయా సంస్థలు ఆందోళనలో ఉన్నాయి. భవిష్యత్తును తలచుకొని ఆవేదన చెందుతున్నాయి. 

 

కరోనా లాక్ డౌన్ ప్రభావం పలు రంగాలపై పడింది. మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది .ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం లాక్ డౌన్ లో కొన్ని మినహయింపులు ఇచ్చింది . లాక్ డౌన్ ప్రభావం దేశంలో ఎక్కువగా సూక్ష్మ మద్యతరహ పరిశ్రమలపై  ఎక్కువగా పడింది. వ్యవసాయరంగం తర్వాత  ఈ రంగంలో ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోనాను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మూడు నాలుగు నెలల పడుతుందని అంచనా వేస్తున్నారు. 

 

మరోవైపు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సూక్ష్మ మద్యతరహ పరిశ్రమలు మూత పడే పరిస్థితి వస్తుందన్న వాదన కూడా ఆయా వర్గాల నుంచి వస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ తరహా పరిశ్రమల్లో ఎక్కువగా వలస కార్మికులు ఉంటారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో వారిని నిలబెట్టుకోవడం వారి ముందున్న తొలి సవాల్‌. ఇప్పటికే వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో వెనక్కి రప్పించడం నిజంగా కష్టతరమే..! 

 

మరోవైపు ఎటువంటి కార్యకలపాలు లేకపోవడంతో కంపెనీలలో నగదు నిల్వలు లేకుండా పోయాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక రూపంలో పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: