జగన్ సర్కార్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రభుత్వ భూముల విక్రయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఏమైనా ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందా.. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జగన్ సర్కార్ మిషన్ బిల్డ్
ఏపీ పేరుతొ నిధుల కోసం
విశాఖ, గుంటూరు నగరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయం చేపట్టింది. ఈ వ్యవహారం పై సామజిక కార్యకర్త
తోట సురేష్ తో పాటు మరి కొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీ హైకోర్టులో వాదనల సందర్భంగా ధర్మాసనం
ఏపీ ప్రభుత్వం నిర్ణయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కరోనా కాలంలో అత్యధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర సంక్షేమం కోసం పాటు పడుతున్న మందుబాబులకు ప్రభుత్వం కృతఙ్ఞతలు తెలపాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రభుత్వం తరుఫు
న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం మీరు ఎంత బాగా చేస్తున్నారో అందరికి తెలుసనీ పేర్కొంది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది.
ఏపీలో దశలవారీగా మద్య నిషేధం తెస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచింది. కానీ దుకాణాలు తగ్గినా మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. లాక్‌డౌన్ కారణంగా నెలన్నర పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయినా గత ఏడాది కంటే లిక్కర్ ఆదాయం ఎక్కువే వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం బాబులపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నారు.