అక్రమాస్తుల కేసులో వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు తేలడంతో వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నిర్బంధంలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన జగన్‌పై ఈడీ ఉదాసీనంగా వ్యవహరించడం తగదని ఆయన అన్నారు. నాలుగు నెలల క్రితమే అక్రమాస్తుల కేసులో జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ ప్రధాన ముద్దాయిలు అయినందున, వారికి చెందిన రూ. 863 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఈడీ తాను జారీ చేసిన ఉత్తర్వులనే విస్మరించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. మనీ లాండరింగ్‌ చట్టం కింద జరిగిన దర్యాప్తులో జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లు ఐపీసీ సెక్షన్‌ 120-బీ రెడ్‌విత్‌ 420, 409, 419, 468, 471, 477 ఎ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 9, 11, 12, 13 (2) రెడ్‌విత్‌ సెక్షన్‌ 13(1) సీ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు తేలడంతో వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ స్వయంగా ప్రకటించిందని గుర్తు చేశారు. నాలుగు నెలలుగా ఈ కేసులపై దర్యాప్తు చేయకుండా ఈడీ ఎందుకు స్తబ్ధత పాటించిందో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల ఆస్తులను సొంతానికి కూడగట్టుకున్న జగన్‌ వ్యవహారంపై విచారణ పూర్తి చేయడంలో ఈడి అలసత్వం వీడాలని కోరారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో వ్యాన్‌పిక్‌ ఆస్తుల జప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, న్యాయ ప్రాదికారత సంస్థ ఆదేశించినంత వరకు ఈడి తన విధులను నిర్వర్తించకపోవడం శోచనీయమని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌, వైకాపా ఆడిన నాటకంలో భాగంగా సానుభూతి సంపాదించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజే జగన్‌ ఆస్తుల జప్తు నోటీసులు జారీ చేయడంపై అప్పుడే రాజకీయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలు నమ్మాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు వివిధ నేరాలకు పాల్పడినట్లు నమోదు చేసిన సెక్షన్ల కింద జగన్‌ను నిర్బంధంలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి సాక్షాలతో న్యాయ ప్రాదికార సంస్థకు అందజేయాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: