దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా మంది ఆక్సిజన్ అందక, బెడ్లు చాలక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలొ ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు పాటిస్తున్నాయి. కరోనా భయం పొగొట్టేందుకు కొన్ని ప్రాంతాల్లో సీఎంలు, అధికారులు, నాయకులు..కరోనా సోకిన వారిని పరామర్శిస్తున్నారు. వారితో ముచ్చటిస్తున్నారు. తాజాగా ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. లాక్ డౌన్ లో రైతులకు వారి వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం కలగనివ్వద్దని పోలీసులకు సూచనలు చేశారు. మరికొన్ని రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించే టైమ్‌ కావడంతో.. రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయని, ధాన్యం సేకరణ మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా కాలంలో కోవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.

ప్రజలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా కట్టడికి లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని, అనవసరంగా రోడ్లపైకి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇటువంటి సమయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు. కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని.. ఇందుకోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వైద్య సిబ్బంది ఇదే స్పూర్తిని కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. కరోనా బాధితులను పరామర్శించేందుకు వరంగల్ ఎంజీఎంలో సీఎ కేసీఆర్ పర్యటించారు. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: