ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదైంది. అయితే.. కరోనా టెన్షన్, ఆన్ లైన్ క్లాసులు సరిగా అర్థం కాక విద్యార్థులు చదవలేకపోయారని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనివల్లే ఫెయిల్ అయ్యారని వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాలని ఇంటర్ బోర్డ్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక కార్పొరేట్ కళాశాలలకు లాభం చేకూర్చేందుకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను బోర్డు నిర్వహించిందని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆరోపించింది. జిల్లాల వారీగా ఫలితాలు పరిశీలిస్తే.. ఎక్కడైతే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో అక్కడే ఉత్తీర్ణత ఉందని చెప్పింది. ఆన్ లైన్ విద్యకు దూరమైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది.

మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ప్రైవేటు కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. తల్లిదండ్రుల నుంచి ట్యూషన్ ఫీజు మినహాయించి ఇతర ఏ ఫీజులు వసూలు చేయకూడదు. అతిక్రమించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

ఇక పాలిటెక్నిక్ లో సెమిస్టర్ కు ఒక సబ్జెక్ట్ చొప్పున ఓపెన్ బుక్ విధానంలో పరీక్ష రాసుకునే అవకాశాన్ని సాంకేతిక విద్యామండలి కల్పించింది. దీంతో జనవరి 18న జరిగే డిప్లొమా తొలి సెమిస్టర్ ఇంగ్లీష్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పుస్తకాలు చూస్తూ సమాధానాలు రాయొచ్చు. ఇందుకు విద్యామండలి మొత్తం 5పబ్లికేషన్ల పుస్తకాలను ఎంపిక చేయగా.. అందులో ఏవైనా 2పుస్తకాలను విద్యార్థులు వెంట తెచ్చుకొని పరీక్ష రాయొచ్చు.


కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ ఒడిదుడుకులకు గురైంది. విద్యార్థుల జీవితాలతో కరోనా చెలగాటమాడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిన వారిని పాస్ చేస్తారా లేదా చూడాలి.  

 





మరింత సమాచారం తెలుసుకోండి: