జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్‌ చేసిన విమర్శలపై వైసీపీ స్పందించింది. వైసీపీ ఎవరినీ ఆదుకోలేదన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ...వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది మీకు తెలియదా? కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు వైద్యం అందించింది మీకు తెలియదా? అని ప్రశ్నించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన విషయం మీకు తెలియదా.. మీరు ప్రేమించే చంద్రబాబు చదువుకున్న స్కూల్‌ను బాగుచేసింది కూడా మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రులను వేల కోట్లతో ఆధునీకరించడం కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించిన పేర్నినాని.. పవన్‌ ఏమైనా అనొచ్చా అని ప్రశ్నించారు. మమ్మల్ని పవన్‌ అంటే మానసిక అత్యాచారం కాదా అని ప్రశ్నించారు.. పవన్‌.. ఇంతకీ నిన్ను నడిపించే శక్తి ఎవరు అని ప్రశ్నించారు పేర్ని నాని. బీజేపీ పార్లమెంట్‌లో చేసిన చట్టాలను సైతం అమలు చేయట్లేదు. మరి  ఢిల్లీ వెళ్లి బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు.


అవే కాదు.. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ గురించి, పోలవరం గురించి పవన్ కల్యాణ్‌ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని మంత్రి పేర్ని నాని నిలదీశారు. పవన్ కల్యాణ్‌  పోలంలో ఒక మాట.. ఢిల్లీలో మరో మాట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ వాళ్లను ఎందుకు నిలదీయడం లేదని.. ఈ  రాజకీయం ఎక్కడ నుంచి నేర్చుకున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.


వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీని కలిపి ఉంచేందుకు పవన్‌ కళ్యాణ్‌ తాపత్రయపడుతున్నారని మంత్రి పేర్నినాని విమర్శించారు. అసలు పవన్‌కు ఒక సిద్ధాంతం లేదన్న ఆయన పూటకో మాట.. రోజుకో సిద్ధాంతం అన్నట్టు పవన్ వ్యవహారం ఉంటుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను ద్వేషించడమే పవన్‌ సిద్ధాంతంగా పెట్టుకున్నారని.. శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా పట్టుకుని అడగగలరా అని పేర్ని నాని  నిలదీశారు. జనసేన సభలో పవన్‌ భీమ్లా నాయక్‌ సినిమా డైలాగులే చెప్పారని... జనసేన సైనికులు టీడీపీ జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పకనే చెప్పారని పేర్ని నాని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: