2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ తనయుడు అనే అభిమానంతో జనం వైసీపీకి పట్టం కట్టారని 151 సీట్లు ఇచ్చారని అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. అయితే ఆ నమ్మకాన్ని, అభిమానాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయారని చెప్పారు. గతంలో 151 వచ్చాయి కదా అని ఈసారి ఫ్యాన్ ఇంకాస్త స్పీడ్ గా తిరిగి 175 సాధించాలని టార్గెట్ పెట్టుకుంటోందని, అంత ఓవర్ స్పీడ్ అయితే ఫ్యాన్ గిరగిరా తిరిగి కిందపడిపోతుందని, రెక్కలు విరిగిపోతాయని సెటైర్లు వేశారాయన. వైసీపీ ప్లీనరీ అనంతరం జనసేన కౌంటర్ ఇచ్చింది. ప్లీనరీలో కేవలం వ్యక్తిపూజ జరిగిందని విమర్శించారు నాదెండ్ల మనోహర్.

ముందస్తు కి సిద్ధమేనా..?
175 స్థానాల్లో గెలుస్తామనే ధీమా వైసీపీ నేతల్లో ఉంటే.. మేనిఫెస్టోలో 95 శాతం హామీలు అమలు చేశామనే ధైర్యం ఉంటే.. వెంటనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు నాదెండ్ల మనోహర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో వైసీపీకి తెలిసొస్తుందని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్లీనరీలో వైసీపీ నేతలు మాట్లాడిన భాష కనీస మర్యాదగా కూడా లేదని అన్నారు. అన్ని విషయాల్ని ప్రజలు గమనిస్తున్నారని, ఆ విషయం వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు.

ఇటీవల వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని, అందుకే జగన్ ఫ్రస్టేషన్లో ఉన్నారని, ప్లీనరీలో అలా మాట్లాడారని చెప్పారు నాదెండ్ల. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారని అందుకే వారికి ఏం చేయాలో తోచడం లేదని చెప్పారు. లక్షా 27వేల కోట్ల రూపాయలతో ఏపీలో రైతాంగాన్ని ఆదుకున్నామని జగన్ చెబుతున్నారని, మరి ఏపీలో ఇంకా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించాలు నాదెండ్ల. పులివెందులలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకే సొంత ప్రాంతంలో పర్యటించినా కూడా జగన్ పరదాలు అడ్డుపెట్టుకున్నారని, బ్యారికేడ్లు పెట్టుకుని జనం తన వద్దకు రాకుండా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారని, ఇల్లు కదలకుండా పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: