
అయితే, ఇక్కడే అసలు సిసలైన కిరికిరి మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం, కొడాలి నాని పేరు మీద ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ అనేదే లేదట. రైతు మోషే కేసులో జైలు శిక్ష దాదాపు ఖాయమవడం, లెక్కకు మించిన కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ఆయనకు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకే అధికారులు మొహం చాటేశారట. కానీ, నాని పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ అడ్రస్‌తో గుట్టుచప్పుడు కాకుండా ఓ పాస్‌పోర్ట్ సంపాదించి ఉంటాడన్నది పోలీసుల బలమైన అనుమానం.
ఈ రహస్య పాస్‌పోర్ట్ అండతోనే, ఆయన అగ్రరాజ్యం అమెరికాకు చెక్కేయాలని ప్లాన్ చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే కృష్ణా జిల్లా గుడివాడ కేంద్రంగా ఆయనపై కేసుల చిట్టా చాంతడంత ఉంది. వాలంటీర్లను బెదిరించి రాజీనామాలు చేయించారన్న ఆరోపణలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనల దగ్గర్నుంచి, విశాఖపట్నంలో నమోదైన మరో కేసు వరకు అన్నింటిలోనూ ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గుడివాడ మండలం మల్లాయపాలెం జగనన్న కాలనీకి మెరక తోలకం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసు దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ 'మెరక' వ్యవహారం ఇప్పుడు నానికి మెడకు చుట్టుకున్న పాములా తయారైందని అంటున్నారు. ఈ కేసులన్నీ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో, విదేశాలకు పారిపోవడమే ఉత్తమ మార్గమని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందుకే, పోలీసులు ముందస్తుగా ఈ లుక్‌అవుట్ నోటీసుల అస్త్రాన్ని ప్రయోగించారు. చూస్తుంటే, కోడాలి నాని చుట్టూ పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయనే చెప్పాలి.