ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి జాహ్నవి దంగేటి అంతరిక్ష పరిశోధన రంగంలో అరుదైన ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) చేపట్టిన ప్రతిష్ఠాత్మక టైటన్ స్పేస్ మిషన్ కోసం జాహ్నవి Astronaut Candidate (ASCAN) గా ఎంపికయ్యారు. ఈ మిషన్‌కు nasa మాజీ వ్యోమగామి, రిటైర్డ్ కల్నల్ విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నేతృత్వం వహించనున్నారు.

జాహ్నవి 2026 నుండి మూడు సంవత్సరాల పాటు టైటాన్ స్పేస్ ASCAN ప్రోగ్రామ్‌లో భాగంగా తీవ్రమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నారు. ఇందులో ఫ్లైట్ సిమ్యూలేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకాలజికల్ అసెస్‌మెంట్లు వంటి విభాగాల్లో శిక్షణ ఉంటుంది. 2029లో ఐదు గంటలపాటు జరిగే ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా మానవ అంతరిక్ష పరిశోధనలో ఓ కొత్త అధ్యాయానికి ఆమె శ్రీకారం చేపట్టనున్నారు.

బాల్యంలోనే అంతరిక్షంపై ఆకర్షితమైన జాహ్నవి, 2022లో పోలాండ్‌లోని అనలాగ్ అస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ (AATC) లో శిక్షణ పొందిన తొలి భారత యువతిగా గుర్తింపు పొందారు. nasa నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తొలి ఆసియన్ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత అంతరిక్ష ప్రయాణానికి కావలసిన అనేక నైపుణ్యాల్లో జాహ్నవి సిద్ధమయ్యారు. చిన్న రాకెట్ అయిన సెస్నా 171 స్కైహాక్ ను విజయవంతంగా నడిపారు. జీరో గ్రావిటీ ట్రైనింగ్, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి కీలక అంశాల్లో శిక్షణ పొందారు. అంతేకాదు, 16 దేశాల యువతతో కూడిన అంతర్జాతీయ బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా వ్యవహరించి లీడర్‌షిప్‌ నైపుణ్యాన్ని చాటారు.

అడ్వాన్స్‌డ్ లెవెల్ స్కూబా డైవింగ్ శిక్షణను పూర్తి చేసి, నీటి లోతుల్లో గ్రావిటీ లేని వాతావరణంలో పనిచేయగల సామర్థ్యం కూడా సంపాదించారు. తల్లిదండ్రులు కువైట్‌లో ఉద్యోగాలలో ఉండగా, జాహ్నవి విజయాల వెనుక ఆమె అమ్మమ్మ లీలావతి ప్రధాన శక్తిగా నిలిచారు. చిన్నప్పటి నుండి చందమామ కథలు వింటూ పెరిగిన జాహ్నవి, అంతరిక్షం పట్ల తన కలలను పెంచుకుంది. ఇది మాత్రమే కాదు, కరాటేలో జాతీయ, అంతర్జాతీయ మెడల్స్ సాధించిన జాహ్నవి, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ లాంటి రంగాల్లోనూ శిక్షణ పొంది అద్భుత ప్రతిభను చాటారు. భారతదేశం తరపున అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మరో మేటి యువతి జాహ్నవి దంగేటి దేశానికి గర్వకారణం. ఆమె ప్రయాణం, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: