నందమూరి బాలకృష్ణ నాయ‌క‌త్వంలోని హిందూపురం నియోజకవర్గం ఇప్పుడు ఒక రాజకీయ బిగ్ హాట్ స్పాట్‌గా మారింది. టీడీపీకి ఇక్కడ ఉన్న బలాన్ని తుంచివేయాలనే ప్రయత్నాల్లో ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతీ యత్నం విఫలమయ్యింది. తాజా పరిణామాలు చూస్తే, ఇక అక్కడ వైసీపీకి స్థానం మిగలుతుందా? అనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. వాస్తవానికి, హిందూపురం నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పునాదులు వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకులు – న‌వీన్ నిశ్చ‌ల్, వేణుగోపాల్ రెడ్డి – పార్టీకి నమ్మిన బంటుల్లా సేవలందిస్తున్నారు. 2014లో న‌వీన్ నిశ్చ‌ల్ పోటీ చేసి ఓడిపోయినా, 2019లో మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అదే తరహాలో 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు కాకుండా ఇతరులకు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ, ఈ ఇద్దరూ పార్టీపై నమ్మకంతో ఉంటు ప్రజల్లో పార్టీకి మద్దతు పెంచే పనిలో ఉన్నారు.


అయితే, తాజా పరిణామాలు చూస్తే – పార్టీకి నిబద్ధతగా ఉండే ఈ నేతలనే టార్గెట్ చేయడం రాజకీయంగా అర్థరహితం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న‌వీన్ నిశ్చ‌ల్ తనకు వచ్చే సారి  టికెట్ ఖాయమని పేర్కొన్న వ్యాఖ్యలే కారణంగా ఆయన్ను, అలాగే ఆయనకు మద్దతుగా నిలిచిన వేణుగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది పార్టీకి తగిన వ్యూహమా ? లేక భవిష్యత్తులోనూ మరిన్ని అంతర్గత పోటీలకు బీజమా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ కార్యకర్తల మధ్య ఈ నిర్ణయం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఓవైపు పార్టీ కోసం ఏడేళ్లు శ్రమించిన నేతలు వేటుకు గురవుతుంటే, మరోవైపు ఇప్పటికే ఓడిపోయిన నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో నిబద్ధతగా పనిచేసే వారెవరు మిగలతారన్నదే సందేహంగా మారుతోంది.



ఇక నందమూరి బాలకృష్ణ ఇప్పటికే హిందూపురం నుంచే వరుసగా మూడు సార్లు గెలుస్తూ టీడీపీ పటిష్టతను కొనసాగిస్తున్నారు. వైసీపీ వైఫల్యాన్ని చూస్తే, బాలయ్యకు ఎదురు చెప్పే నాయకత్వాన్ని నిర్మించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. పైగా ఇప్పుడు సీనియర్ నేతలపై వేటు వేసిన తీరు... స్థానిక స్థాయిలో పార్టీని అస్తవ్యస్తం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దృష్ట్యా, హిందూపురంలో వైసీపీకి కొత్త శక్తిని చేకూర్చే నాయకత్వం లేకుండా పోతున్నదని, పైగా మిగిలిన శ్రేణుల్లో ఉన్న నమ్మకాన్ని కూడ కోల్పోతున్నదని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీ తలుచుకుని ముందడుగు వేయకపోతే, ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం గగనమవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: