రాజంపేట ఎంపీ.. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్టు అనంత‌ర ప‌రిణామాలు.. పుంగ‌నూరు స‌హా.. సీమ రాజ‌కీ యాల్లో చ‌ర్చ‌కు దారి తీశాయి. పార్టీల‌కు అతీతంగా.. ఒక్క వైసీపీ మిన‌హా.. ఇత‌ర పార్టీల నాయ‌కులు మిథున్ అరెస్టును స‌మ‌ర్థిస్తున్నారు. ఇది నిజంగా చాలా వ‌ర‌కు పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ప్ర‌భావం చూపించే విష‌య‌మేన‌ని చెప్పాలి. పైగా.. మ‌రింత‌గా ఉచ్చు బిగుసుకుంటోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై ఇప్ప‌టికే ఉన్న అట‌వీ భూముల కేసు, మ‌ద‌న‌ప‌ల్లె ఆర్డీవో కార్యాల‌యంలో అగ్ని ప్ర‌మాదం కేసును కూడా త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది.


ఇవి కూడా ముసురుకుంటే.. పెద్దిరెడ్డికుటుంబానికి మ‌రింత‌గా ఇక్క‌ట్లు త‌ప్పే ప‌రిస్థితి లేదని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వానికి మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మిథున్ రెడ్డికి ముంద‌స్తు బెయిల్ వ‌స్తుంద ని ఆశించారు. కానీ, రాలేదు. పైగా.. బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాక‌రించారు. ఇది ఆ కుటుంబానికి తీర‌ని ఇబ్బందిగా మారింది. మరోవైపు.. నానాటికీ త‌గ్గుతున్న అనుచ‌ర గ‌ణం కూడా.. ఈ కుటుంబ రాజ‌కీయాలకు మ‌రింత ప్ర‌మాదంగా మారాయి.


ప్ర‌స్తుతం పెద్దిరెడ్డి కుటుంబంలో మిథున్ రెడ్డి ఒక్క‌రే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. వ‌య‌సు రీత్యా.. ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి  పెద్ద‌గా యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మిథున్ రెడ్డి స‌తీమ‌ణిని రాజకీయాల్లోకి తీసుకురావాల‌ని ఉన్నా.. ఆమె ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, పెద్దిరెడ్డి సోద‌రుడు, తంబ‌ళ్ల ప‌ల్లె ఎమ్మెల్యే ద్వార‌కానాథ్ రెడ్డి కూడా.. మౌనంగానే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.


మొత్తంగా చూస్తే.. ప్ర‌స్తుతం మిథున్ అరెస్టుతో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గిలింద‌న్న‌ది ప‌రిశీల‌కులు.. స్థానిక నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఇది.. మ‌రోరూపంలో ప్ర‌త్య‌ర్థులు  ఆయా నియోజ క‌వ‌ర్గాల్లో పుంజుకునేందుకు.. అవ‌కాశం క‌ల్పించింద‌ని చెబుతున్నారు. స‌మ‌యం కోసం వేచి చూస్తున్న బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ వంటివారు.. ఇప్పుడు పుంజుకుంటారు. అలానే టీడీపీ కూడా త‌న రాజకీయాల‌ను ముమ్మ‌రం చేయ‌నుంది. ఎలా చూసుకున్నా.. ఒక్క అరెస్టు అనేక ప‌రిణామాల‌కు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: