భారత చైతన్య యువజన పార్టీ(బి సి వై) అధినేత బోడే రామచంద్ర యాదవ్ దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడంతోపాటు బీసీ సామాజిక వర్గాలు సహా వెనుకబడిన వర్గాలను కూడా ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీసీవై పార్టీ పుంజుకునే లాగా చేయాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవల విజయవాడలో బీసీవై రెండవ ఆవిర్భావ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళిక పేర్కొంటూ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలను అభివృద్ధి చేస్తామని, బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారానికి దగ్గర చేస్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రెండు కీలక సామాజిక వర్గాలపై తన యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతను అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోనే మేధావులను ఐక్యం చేసి వచ్చే ఎన్నికల నాటికి వీరందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తానని ఆయన అంటున్నారు.


అయితే, దీనివల్ల బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా.. అనే విషయం పక్కన పెడితే ప్రధాన పార్టీలైన టిడిపి, జనసేన, వైసీపీ లకు మాత్రం బీసీవై పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలకు నాలుగు సంవత్సరాలు సమయం ఉండడం, ఇప్పటినుంచే రామచంద్ర యాదవ్ ప్రజలను కలుసుకునేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉండటం వంటి పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆయా పార్టీలకు బోడే గట్టి ప్రత్యర్థి అవుతారనడంలో సందేహం లేదు. రాజకీయాల్లో కొత్త నేతలు రావడం సహజమే అయినా బలమైన మద్దతు ఉన్న నాయకుడిగా బోడే ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కరేడు ప్రాంతంలో రైతులు ఉద్యమాలు చేసినప్పుడు వారికి మద్దతుగా బోడే నిలిచారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలను కొనసాగించారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నామని చెప్పినప్పుడు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నేరుగా ఆయనను కలిసి తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అంటే రైతుల్లో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ను స్పష్టం చేస్తుంది. ఇదే పరిణామం ముందు ముందు కొనసాగితే బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.


రాష్ట్రంలో బలమైన పార్టీలకు ఒక గట్టి పోటీ ఇచ్చే నాయకత్వం కూడా లభించే అవకాశం ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఆయన ఇమేజ్ మాత్రం పెద్దగా ఎక్కడా తగ్గకపోవడం.. బడుగు బలహీనవర్గాల లో ఆయనకు బలమైన పట్టు కనిపిస్తుండడం.. భవిష్యత్తును ఆశాజనకంగా మార్చింది. ఇది ప్రధాన పార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామంగా కూడా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: